Free Symbols Effect : మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే టీఆర్ఎస్ ఓట్లకు చపాతీ మేకర్, రోడ్ రోలర్ గుర్తులు భారీగా నష్టం చేకూర్చాయి. ఎవరూ ఊహించని స్థాయిలో ఈ గుర్తుల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఓట్లు సాధించారు. మూడు ప్రధాన పార్టీల తర్వాత అధికంగా బీఎస్పీ అభ్యర్థికి ఓట్లు వచ్చాయి. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అంధోజు శంకరాచారికి 4145 ఓట్లు వచ్చాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అభ్యర్థి మరమొని శ్రీశైలం యాదవ్ 2407( చపాతీ మేకర్) ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ విశారదన్ మహారాజ్ బలపరిచిన ఇర్పుల గలయ్య(చెప్పుల జోడు)గుర్తుకు 2270 ఓట్లు రాగా యుగ తులసి పార్టీ అభ్యర్థి శివ కుమార్(రోడ్డు రోలర్) కు 1874 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేఏ పాల్ కు 805 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఇస్లవత్ రాజేందర్ కు 502 ఓట్లు, తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ కు 169 ఓట్లు వచ్చాయి. నోటా కు 482 ఓట్లు వచ్చాయి.
కారును పోలిన గుర్తులు
కారును పోలిన గుర్తులు పెద్దగా కాకపోయినా ఓ మాదిరినే దెబ్బకొట్టాయని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. ఎన్నికల గుర్తుల పంచాయితీ ఈసీకి చేరి కొంత మేరకు కారును పోలిన గుర్తులు తొలగించుకున్నా మిగిలిన గుర్తులకు ఎన్నికల్లో బాగానే ఓట్లు వస్తున్నాయి. దుబ్బాక ఎన్నికల్లో కారును దెబ్బతీసిన చపాతీ మేకర్ మునుగోడు ఎన్నికల్లోనూ ఓ మాదిరిగా ప్రభావం చూపింది.
ఫ్రీ గుర్తులపై హైకోర్టుకు
మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 గుర్తులను ఎవరికి కేటాయించవద్దని గులాబీ పార్టీ హైకోర్టుకు కూడా వెళ్లింది. ఫ్రీ సింబల్స్ నుంచి కారును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలని ఈసీకి లేఖ రాసింది. మునుగోడు ఉపఎన్నిక గుర్తుల జాబితా నుంచి ఓడ, డోలీ, కెమెరా, రోడ్ రోలర్, టీవీ, కుట్టు మిషన్, చపాతీ రోలర్, సబ్బు డబ్బా గుర్తులను తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ అక్టోబర్ 10వ తేదీన ఎన్నికల కమిషన్ ను టీఆర్ఎస్ కోరింది. అయితే టీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తికి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో టీఆర్ఎస్ అధిష్ఠానం ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించింది.
రోడ్ రోలర్ ప్రభావం
2018లో జరిగిన ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ చెబుతోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయని అంటోంది. కారును పోలి ఉన్నందు వల్లే వాళ్లు గెలవగలిగారని ఈసీకి వివరించింది. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్సీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువా, నాగార్జున సాగర్‌లలో కెమెరా గుర్తుకు కూడా బీఎస్సీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. ఈ క్రమంలోనే ఈ ఎనిమిది గుర్తులను తొలగించాలని కోరారు.