CEO Vikas Raj : మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ప్రొసిజర్ ప్రకారం అధికారికంగా ఆర్ఓ ఫలితాలు విడుదల చేస్తారన్నారు. ర్యాండమ్ గా 5 ఈవీఎమ్ లలో వీవీ ఫ్యాట్లను లెక్కించి సరిచూసుకుంటారని తెలిపారు. ఎక్కడా పక్షపాతం లేకుండా ఎన్నికల ప్రక్రియను ముగించామన్నారు. ఆరోపణలు ఎన్ని వచ్చిన ఎన్నికల నియమావళి ప్రకారం నిర్వహించామన్నారు. వ్యక్తిగత తప్పిదంపై ఆర్వో పై వేటు పడిందన్నారు. దేశం మొత్తం ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఉపఎన్నికలో సిబ్బందికి సహకరించిన వారికి అభినందలు తెలిపారు. మునుగోడులో ఎలక్షన్ కోడ్ నవంబర్ 8న ముగుస్తుందన్నారు. 






"రౌండ్ వారీగా ఫలితాలు అన్నీ ఈసీ వెబ్ సైట్ లో అప్లోడ్ చేశాం. బేసిక్ కౌంటింగ్ ప్రాసెస్ పూర్తయింది. ఒక ఐదు ఈవీఎమ్ లోని ఆర్వో సెలెక్ట్ చేస్తారు. క్రాస్ వెరిఫికేషన్ కోసం వీవీ ప్యాట్ లో లెక్కిస్తారు. వాటిని సరిచూసి అభ్యర్థులతో ఒకసారి చర్చించి ఫైనల్ రిజెల్ట్స్ విడుదల చేస్తాం. పోలింగ్ కోసం 6000 మంది పనిచేశారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మునుగోడును ప్రశాంతంగా నిర్వహించాం."-సీఈవో వికాస్ రాజ్ 


అందుకే జాప్యం


మునుగోడు ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడిలో జాప్యంపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ బుద్ధ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 4వ రౌండ్ కి 5వ రౌండ్ కి 20 నిమిషాలు లేట్ అయ్యింది అంతేనని అన్నారు. ఏదైనా కారణం వల్ల లేట్ అయితే తాము ఏమి చేయగలమని అన్నారు. మన దగ్గర అభ్యర్థులు ఎక్కువగా ఉండడం వల్లనే లేట్ అవుతుందని అన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం చేసిన తరువాతనే రిజల్ట్ లు రౌండ్ ల వారీగా వస్తాయని చెప్పారు. ప్రతి రౌండ్ ముగియగానే మీడియాకు సమాచారం ఇస్తున్నామని అన్నారు. ప్రతి టేబుల్‌ వద్ద అబ్జర్వర్లు, పార్టీల ఏజెంట్లు ఉన్నారని తెలిపారు.


స్పందించిన కలెక్టర్


అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడకుండా కొన్ని మీడియా ఛానళ్లు లేదా కొన్ని ఇతర మాధ్యమాలు ఊహగానాలతో ఫలితాలను ముందస్తుగా, ఊహిస్తూ ప్రసారం చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి అన్నారు. కాబట్టి, వాటిని అధికారికమైన వాటిగా పరిగణనలోకి తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి కోరారు. ఇప్పటివరకు కేవలం మూడవ రౌండ్ ఫలితాలు మాత్రమే అధికారికంగా వెలువడ్డాయని ఆయన తెలిపినట్లుగా జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) ఓ ప్రకటన విడుదల చేశారు.