Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ చిన్న చిన్న ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లోని 298 బూత్‌లలో గురువారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. గత ఎన్నికల్లో 91.30 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయ్యే అవకాశముందని ప్రధాన పార్టీలు భావిస్తున్నారు. చివరి గంటలో ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు వస్తుండడంతో పలు కేంద్రాల వద్ద చెదురు మదురు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పూర్తిస్థాయి పోలింగ్ శాతంపై స్పష్టత వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశముందని ఎన్నికల అధికారులు అంటున్నారు.
ప్రశాంతంగా పోలింగ్
"మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగింది. ఇంకా చాలా ప్రాంతాల్లో క్యూ లైన్ లో ఓటర్లు వేచి ఉన్నారు. మూడు ఈవీఏంలు మార్చారు, నాలుగు వీవీప్యాట్ లు మార్చారు. ఇప్పటి వరకూ 6100 లీటర్లు మద్యం స్వాధీనం చేసుకున్నారు. రూ.8.27 కోట్ల నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాం. 3.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఈరోజు 98 ఫిర్యాదులు వచ్చాయి. 70 మందిని స్థానికేతరులను గుర్తించారు. వారిని బయటకి పంపారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఉంటుంది. లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. లెక్కింపు కోసం మైక్రో అబ్జర్వర్ లను నియమిస్తాం. స్థానికేతరలను అబ్జర్వర్ల బృందాలల్లో నియమిస్తాం"- వికాస్ రాజ్, ప్రధాన ఎన్నికల అధికారి
ఓటర్ నాడిపై ఉత్కంఠ
మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. పోలింగ్ ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెప్పిన మాట వినాలంటూ అధికారులను టీఆర్ఎస్ నేతలు బెదిరించారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ తోపాటు వివిధ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 47 మంది మునుగోడు ఉపఎన్నికలో పోటీ పడ్డారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నడిచింది. పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఉపఎన్నికలో గెలుపు తమదే విజయమని ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఫలితం ఎలా ఉంటుందోనని లోలోపల మాత్రం టెన్షన్ పడుతున్నారు అభ్యర్థులు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉపఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తున్నారు. దీంతో మునుగోడు ఫలితంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.
Also Read : KA Paul: పోలింగ్ బూత్‌ల వద్ద కేఏ పాల్ ఉరుకులు, ఆయన సమాధానం వింటే నవ్వుకోవాల్సిందే!