హీరో నందు, రష్మీ కలసి నటించిన సినిమా 'బొమ్మ బ్లాక్ బస్టర్' విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. మంచి కథతో తీసిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని అన్నారు. సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉన్నాయని అన్నారు. పాటలు కూడా బాగున్నాయని చెప్పారు. థియేటర్స్ నుంచి వచ్చిన వాళ్ళకి సినిమాలో అవకాశం కల్పించడం గ్రేట్ థింగ్ అని అన్నారు. 


సినిమాలో హీరోయిన్ రష్మీ గురించి చెప్పక్కర్లేదని, టీవీ చూసే ప్రతి ఒక్కరికీ రష్మీ తెలుసని అన్నారు. ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా.. నందుకు సపోర్ట్ చేయడానికి ప్రమోషన్స్ లో ఆటోలో తిరిగిందని విన్నాను. రష్మీకి సినిమా అంటే ఎంత ఇష్టమో ఇక్కడే తెలుస్తుందన్నారు. హీరో నందు అంటే ఇండస్ట్రీలో తెలియని వాళ్లుండరని అన్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చే టైమ్ కే నందు సినిమాలు చేస్తున్నాడని చెప్పారు. నందుకు సపోర్ట్ చేసిన నిర్మాతలకు ధన్యవాదాలని తెలిపారు. యష్‌కు 'కేజీఎఫ్', అల్లు అర్జున్ కి 'పుష్ప' లాగా నందుకు కూడా ఒక బ్లాక్ బస్టర్ రావాలి అని, అది ఈ సినిమానే కావాలి అని ఆకాంక్షించారు


సినిమాలను చూడటానికి ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు రావాలని ఆకాక్షించారు నాగశౌర్య. ‘‘బలిసి ఎవరూ సినిమాలు తీయట్లేదని, ఇంకేమి చేయడం తెలియక, ఎక్సర్సైజ్ లు చేస్తూ కడుపులు మాడ్చుకొని సినిమాలు చేస్తున్నాం’’ అని అన్నారు. మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసిన ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుతున్నానని అన్నారు. 


ఇక ఈ సినిమాలో మొదట్నుంచీ అన్నిటినీ వినూత్నంగా రివీల్ చేస్తూ వచ్చారు మూవీ టీమ్. టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ వరకూ అన్ని కొత్తగా చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ సర్కులేట్ అవుతూ ఉంది. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ట్రైలర్ లో డైలాగ్స్, నందు రష్మీ రొమాన్స్ కూడా బాగా వర్కవుట్ అవ్వడంతో సినిమా పై బజ్ పెరిగింది.


హీరో నందు క్రికెటర్ హర్భజన్ సింగ్ తో చేసిన ప్రమోషన్ వీడియో కూడా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇలా కూడా సినిమా ప్రమోషన్స్ చేస్తారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ కూడా చేశారు. దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో వచ్చినన్ని మీమ్స్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రాలేదు.


అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా నందుకు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై తీస్తున్న ఈ సినిమాలో రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : ప్రభాస్ 'సాహో'లో సీన్స్ కాపీ చేసిన షారుఖ్ 'పఠాన్'?