Munugode Bypoll : తెలంగాణలో కాక రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. అక్టోబరు 7న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల అవ్వగా 14వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గడువు ముగిసే సరికి 130 మంది అభ్యర్థులు 199 నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల పరిశీలనలో 47 మంది అభ్యర్థుల నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మిగిలిన 83 మంది అభ్యర్థు్ల్లో 36 మంది సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తంగా 47 మంది అభ్యర్థులు ఉపఎన్నిక బరిలో నిలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది.
బరిలో 47 మంది అభ్యర్థులు
మునుగోడు ఉపఎన్నిక రసవత్తంగా మారుతోంది. ఎన్నిక గడువు దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. మునుగోడులో హామీల వర్షం కురిపిస్తున్నారు. నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో అధికారులు పోటీలో ఉన్నవారి జాబితా వెల్లండించారు. మొత్తం 130 మంది నామినేషన్లు దాఖలు చేయగా 47 నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. మరో 36 మంది నామినేషన్లను చివరి రోజు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో 47 మంది నిలిచారు. వీరిలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, బీఎస్పీ, ప్రజాశాంతి పార్టీతో పాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలు, ఇంటిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
పోటీ ఆ మూడు పార్టీల మధ్యే
టీఆర్‌ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, బీఎస్పీ నుంచి ఆందోజు శంకరచారి పోటీలో ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భేటీతో 13 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. ఆదివారం మరో 10 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సోమవారం మరో ముగ్గురు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. వీరు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తమ మద్దతు తెలిపారు. మునుగోడు పోటీలో 47 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడులో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలు పెద్ద మైనస్ అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో బీజేపీ బలం లేనప్పటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో ప్రధాన పోటీదారుగా నిలిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉండడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
హోరాహోరీ ప్రచారం
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి మునుగోడులో మంచిపట్టుడడంతో పార్టీ మారినా ఓట్లు పడతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తమ అభ్యర్థిపై సానుకూలత ఉందని అంటున్నారు. కేంద్ర నాయకత్వాన్ని రంగంలోకి దించి బీజేపీ జోరుగా ప్రచారం చేస్తుంది. అలాగే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపు తమకు ఫ్లస్ అవుతోందని భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం ఉన్నప్పటికీ నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి దూరంగా ఉండడంతో ఆ పార్టీపై మరింత ప్రభావం పడుతుంది. ఇక అధికార టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా మంత్రులు రంగంలోకి దిగారు.