AP Govt : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో షాక్ తగిలింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై ఎన్జీటీ విధించిన నష్టపరిహారాన్ని తక్షణమే జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పులో అన్నింటినీ అమలు చేయాలని స్పష్టంచేసింది. రూ.250 కోట్ల పరిహారం చెల్లింపుపై తదుపరి విచారణ కొనసాగిస్తామని కోర్టు తెలిపింది. అప్పటి వరకు ఎన్జీటీ తీర్పులోని మిగిలిన అంశాలు అమలుచేయాలని స్పష్టం చేసింది.
ఎన్జీటీ జరిమానా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇటీవల గట్టి షాక్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున భారీ జరిమానాలు విధిస్తూ తీర్పు చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు ఏకంగా రూ. 120 కోట్లను జరిమానాగా విధించింది. పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు రూ. 24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు 24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు రూ. 73.6 కోట్లు జరిగిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. వీటిని ఎలా వినియోగించాలో ఏపీ పీసీబీ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఎన్టీటీ ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వ వాదన
పురుషోత్తమపట్నం, పట్టిసీమ, చింతలపూడి... పోలవరంలో భాగమైన ప్రాజెక్టులని ఏపీ ప్రభుత్వం వాదించింది. పోలవరం పూర్తవడానికి ముందే నీటిని పోలవరం కాలువల ద్వారా పంపించడానికి నిర్మించిన ప్రాజెక్టులని అంటోంది. అయితే వీటికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ఎన్జీటీలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపైనా ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిపై విచారణ జరుపుతోంది. ఈ మూడు ప్రాజెక్టులు అక్రమం అని గతంలోనే ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. ఈ మూడు ప్రాజెక్టులు పోలవరంలో భాగం కాదని కేంద్ర జలశక్తి శాఖ ఎన్జీటీకి చెప్పింది. దీంతో పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎన్‌జీటీ స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో సవాల్
అయితే పురుషోత్తమ పట్నం ఒక్కటే నిర్మాణంలో ఉంది. పట్టిసీమ,చింతలపూడి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రెండు ప్రాజెక్టులకు ఇప్పటికే నిర్వహణలో ఉన్నందున పర్యావరణ అనుమతులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ సూచించింది. పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ వాటిని నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి - పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తరవాతే పనులు చేపట్టాలని ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఎన్జీటీ తీర్పు యథావిధిగా అమలు చేయాలని తెలిపింది. ఎన్జీటీ విధించిన పరిహారాన్ని జమ చేయాలని సూచించింది. పరిహారంపై తదుపరి విచారణ చేస్తామని సుప్రీం తెలిపింది.
Also Read : వైసీపీ ఎంపీ ఇంట్లో టీడీపీ నేతలు- నెల్లూరు రాజకీయాల్లో ఏదైనా జరగబోతోందా?