Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నికపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. రేపు(మంగళవారం) సాయంత్రం ఆరు గంటల తరువాత నాన్ లోకల్స్ ఎవరు నియోజకవర్గంలో ఉండకూడదని తెలిపారు. మునుగోడులో అణువణువూ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. నాన్ లోకల్ వాళ్లు మునుగోడులో ఎవరు ఉన్న చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించామని, ఎవరైనా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు మునుగోడు లో ప్రచారం ముగుస్తోందని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.
298 పోలింగ్ కేంద్రాలు
"మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కొత్త డిజైన్ తో కూడిన ఓటర్ ఐడీ ఇచ్చాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశాం. ఫ్లైయింగ్ స్కాడ్ తో కలిసి మొత్తంగా యాభై టీంలు ఉన్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
3366 పోలింగ్ సిబ్బందిని , 15 బలగాల సిబ్బంది మునుగోడులో వినియోగిస్తున్నాం. ఎక్కువగా డబ్బు పట్టుబడటంతో ఇన్ కం ట్యాక్స్ అధికారులను ఆదేశించాం. 111 బెల్ట్ షాపులను సీజ్ చేశాం. 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం."- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్
రూ.6.80 కోట్ల నగదు స్వాధీనం
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో 185 కేసులు, 6.80 కోట్ల నగదు, 4500 లీటర్ల లిక్కర్ పట్టుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి వివరణ కాసేపటి క్రితమే అందిందన్నారు. దీనిపై ఈసీ నివేదిక పంపామని తెలిపారు. రిటర్నింగ్ అధికారిపై సీఈఓ కార్యాలయం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఓటర్ల స్లిప్పులు కూడా అందరికీ పంపించామని తెలిపారు. ఒకటి రెండు శాతమే పెండింగ్ లో ఉన్నాయన్న ఎన్నికల ప్రధాన అధికారి... ఓటర్ స్లిప్పులను ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు అన్నారు. 100 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉందన్నారు. పోలింగ్ నిర్వహించే వారికి ట్రైనింగ్ ఇచ్చాం. మొద్దం 1190 పోలింగ్ సిబ్బంది రిక్వైర్మెంట్ ఉందన్నారు. మరో మూడు వందల మందిని రిజర్వ్ లో పెట్టామన్నారు.
ఓటర్ ఐడీ తప్పనిసరి
"ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వాళ్లు ఎవరైనా రేపు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఉండకూడదు. ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం. కల్యాణ మండపాలు, హోటళ్లు, ఇతర ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించమని చెప్పాం. నియోజకవర్గ వ్యాప్తంగా చెక్ పోస్టులు పెట్టాం. అనవసరమైన మూవ్మెంట్ ఉండకూడదు. ఎవరైనా నియోజకవర్గంలో ప్రయాణించాలంటే ఓటర్ ఐడీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ కు ఆదేశాలు ఇచ్చాం. ఎన్నికల ప్రచారం కోసం ఎలాంటి సందేశాలు పంపవద్దని చెప్పాం. మొత్తం 479 ఫిర్యాదులు అందాయి. దాని మీద యాక్షన్ తీసుకున్నాం. ప్రశాంతం ఉపఎన్నిక జరగాలని కోరుతున్నాం."- వికాస్ రాజ్