Karimnagar District News: జగిత్యాల జిల్లా బుగ్గారం కొత్త మండలంగా ఏర్పాటై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇక్కడి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు లేకపోవడంతో అధికారులు.. అక్కడ కొన్నాళ్లు ఇక్కడ కొన్నాళ్లు సేవలను అందిస్తున్నారు. నిత్యం రోగులు వచ్చే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలోని ఓ గదిలో పోలీస్ స్టేషన్ ను కొనసాగిస్తున్నారు. టీకా ఇచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేవారు మాటల్లో చెప్పలేని వేదనను అనుభవిస్తున్నారు. వసతి గృహంలో తహసీల్దార్, ఎంఈఓ కార్యాలయంలో ఎంపీడీవో కార్యాలయాలు నడుస్తున్నాయి. 


ఏ ఆఫీసు ఎక్కడుందో తెలియని పరిస్థితి..


సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కొత్త భవనాల నిర్మాణాలకు స్థల సమస్య వెంటాడుతుంది. దీంతో ఉన్న పాత భవనాలు, పాఠశాల ఆవరణలోనే నెట్టుకు రావలసిన పరిస్థితి నెలకొంది. తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో, పంచాయతీలో పోలీస్ స్టేషన్ నడుస్తుంది. మండల వనరుల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది సేవలను అందిస్తున్నారు. ఇటీవల పాఠశాలను ఆధునికీకరించడంతో ఉన్న వాటిని ఇతర ప్రత్యామ్నాయ ప్రాంతాల్లోకి మార్చాల్సి వచ్చింది. ఇక్కడికి పలు గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఈ భవనాలను వెతుక్కొని తమ ఇబ్బందులను చెప్పుకోవడం సమస్యగా మారుతుంది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త రూపును అందుకున్న మండలాల పరిస్థితి దయనీయంగా మారింది. కాలం ముందుకెళ్తున్నా కూడా... కొత్త మండలాలు పాతబడుతున్నా... సమస్యలు మాత్రం ఎక్కడివి అక్కడే అన్నట్టుగా మారింది.


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 16 కొత్త మండలాలు..


కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో మొత్తం 63 మండలాలు ఉన్నాయి. ఇందులో ఏకంగా 16 మండలాలు నూతనంగా ఏర్పాటైనవి. గడిచిన నెల రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో భీమారంతోపాటు, ఎండపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రాన్ని విడుదల చేసింది. దీంతో ఎండపల్లిలో ఇప్పుడిప్పుడే ఆయా కార్యాలయం కోసం భవనాలను వెతుకుతున్నారు. భీమారంలో అయితే ఇంకా ఊసే లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ గ్రామీణం, కొత్తపల్లి, గన్నేరువరం, ఇల్లంతకుంట, పాలకుర్తి, రామగిరి ,అంతర్గాం, వీర్నపల్లి, రుద్రంగి, తంగళ్ళపల్లి, వేములవాడ గ్రామీణం, జగిత్యాల గ్రామీణం, బీర్పూర్, బుగ్గారం, ఎండపల్లి, భీమారం పరిపాలన కేంద్రీకరణలో భాగంగా వచ్చాయి. 


అన్ని ఏర్పాట్లు చేస్తేనే ప్రజలకు ఉపయోగం..


దాదాపు ఆరేళ్ల క్రితం ఏర్పాటైన కొత్త మండలాల్లో సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపుగా 200 గ్రామాల ప్రజలకు మేలు చేయాలని సంకల్పంతో కార్యాలయాలను చెంతకు తెచ్చినా... సొంత భవనాలు లేక ఉద్యోగ యంత్రాంగం అవస్థలను ఎదుర్కొంటుంది. ఒకటి రెండేళ్లలో పరిస్థితి కుదుటపడుతుందని భావించినా, ఇంకా మొదట్లో ఎలా ఉందో అదే పరిస్థితి అన్ని చోట్ల ఎదురవుతుంది. స్థలాలు అందుబాటులో ఉన్న భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు అనే మాటే లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. మరోవైపు కొత్తగా ఏర్పటైన మండలాలకు ఆయా విభాగాల్లో ఉద్యోగులను తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. ఇప్పటికీ అదనంగా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారితోనే విధులను నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలకు పరిపాలన పరమైన ఇక్కట్లు అన్ని రకాలుగా ఎదురవుతున్నాయి. పాలకులు ఉన్నతాధికారులు స్పందించి కనీస వసతులు కల్పనకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.