మంచి బ్యాగ్రౌండ్ ఉండి కూడా ఇప్పటివరకూ సరైన బ్లాక్ బస్టర్ రాని హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అల్లు శిరీష్ ఒకరు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన సినిమాలేవి అంతగా ఆకట్టుకోలేదు. ఈసారి 'ఊర్వశివో రాక్షసివో' అంటూ మరో ప్రయత్నం చేస్తున్నారు శిరీష్. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు మూవీ టీమ్. సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు పకడ్బందీగా విడుదల చేస్తూ వస్తున్నారు మేకర్స్. అంతకముందు విడుదల చేసిన టీజర్ తో మంచి టాక్ ను సొంతం చేసుకుందీ మూవీ. ఇప్పుడు ట్రైలర్ కూడా రీలీజ్ అయింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ట్రైలర్ లో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూయెల్ జంట ఆన్ స్క్రీన్ లో చూడటానికి బాగుంది. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి ఎప్పుడూ ట్రెండీ గా ఉండే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అలాంటి వాళ్లిద్దరూ కలసి ఉండగలరా, అసలు చివరికి కలుస్తారా అనే ఆసక్తికర అంశాలు సినిమాలో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అలాగే ట్రైలర్ లో వచ్చే ఫన్నీ డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్స్ బాగా కుదిరాయి. "తను కొరియన్ వెబ్ సిరీస్‌లా ట్రెండీగా ఉంటే.. నువ్వేంట్రా కార్తికదీపం సీరియల్‌లో డాక్టర్ బాబు, వంటలక్కలాగా పేజీలు పేజీలు డైలాగ్స్ చెబుతున్నావ్’ అంటూ ఆయన చెప్పే డైలాగ్ "ఇన్ని ఈఎంఐ లు ఉన్నోడు ఏ అమ్మాయి గురుంచి ఆలోచించకూడదురా అది బేసిక్స్" అంటూ వచ్చిన డైలాగ్స్ ఫన్నీ గా ఉన్నాయి. అలాగే "నేనిక్కడ నానా పటేకర్ రేంజ్‌లో పర్ఫామెన్స్ చేస్తుంటే.. నువ్వు కనీసం ఈటీవి ప్రభాకర్ లాగా క్యాచ్ చేయలేకపోతున్నావ్" అంటూ సునీల్ చెప్పే డైలాగ్స్ సరదాగా అనిపిస్తున్నాయి. చూస్తుంటే సినిమా మొత్తం ఇదే ట్రెండ్ లో కామెడీయే ప్రధానంగా సాగే సినిమాలా అనిపిస్తోంది.
మొన్నటి వరకూ సినిమా విడుదల పై అనేక వార్తలు వచ్చాయి. సినిమా రిలీజ్ సమయం దగ్గర పడటంతో ట్రైలర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. అంతకంటే ముందు టీజర్ తోనే సినిమా పబ్లిక్ లోకి బాగా వెళ్ళింది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూయెల్ ప్రేమలో పడ్డారని కూడా వార్తలు వచ్చాయి. అయితే కోస్టార్ గా మంచి స్నేహబంధం ఉంది తప్ప మా మధ్య ఏమీ లేదని తేల్చి చెప్పేసారు కూడా. ఇలాంటి వార్తలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి, దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. మొత్తంగా సినిమా ఓ రొమాంటిక్, కామెడీ డ్రామా సినిమాలా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. శిరేష్ కు జంటగా అను ఇమ్మాన్యూయెల్ కనిపించనున్నారు.
అనూప్‌రూబెన్స్, అచ్చు రాజమణి బాణీలు సమకూర్చారు. ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తోన్న అల్లు శిరీష్ కు ఈ 'ఊర్వశివో రాక్షసివో ' సినిమా ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.