Adilabad Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనక నుంచి వస్తున్న ఓ లారీ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టగా.. ఆ కారు ముందు వెళ్తున్న కంటైనర్ ను ఢీకొట్టింది. దీంతో లారీ, కంటైనర్ మధ్యలో కారు ఇరుక్కుపోయింది. దీంతో ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో మహిళ తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అలాగే తీవ్రంగా గాయపడిన మహిళను కూడా అదే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడకు చెందిన రఫతుల్లా కుటుంబం హైదారాబాద్ కు కారులో వెళ్లి వస్తోంది. అయితే ఆదివారం అర్ధరాత్రి గుడిహత్నూర్ మండలం సీతాగొంది వద్దరు చేరగానే.. ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ షంశు, సయ్యద్ రఫతుల్లా అష్మి, వజాహత్ ఉల్లా, సబియా అనే నలుగురు మృతి చెందగా జుబీయా అనే వైద్యురాలికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న జుబీయా కు రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదం గురించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదేచోట ఉదయం మరో ప్రమాదం..
హైదరాబాద్ నుండి నాగ్ పూర్ వెళ్తున్న వాహనాలు అదుపు తప్పి ఒకదానికి ఒకటి వరుసగా మూడు కంటైనర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి జరిగిన ప్రమాద స్థలంలోనే ఇప్పుడు మరో ప్రమాదం జరగడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. జాతీయ రహదారి మూలమలుపు వద్ద ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం, ఎత్తైన కొండ ప్రాంతం వద్దనే మూలమలుపు ఉండడం వల్లనే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. అయితే జాతీయ రహదారి నిర్మాణంలోనే లోపాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని, జాతీయ రహదారి అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, పలు చోట్ల సూచిక బోర్డులు ఎర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బావిలోకి దూసుకెళ్లిన కారు - నలుగురు మృతి
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బైపాస్ లో ఇటీవలే ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ కారు బావిలోకి దూసుకెళ్లింది. ఈ కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. టేకుల పల్లి నుంచి అన్నారం వెళ్తోన్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారును జేసీబీ సహాయంతో పోలీసులు బయటకి తీశారు. అటుగా వెళ్తోన్న విద్యార్థులు సిద్ధూ, రంజిత్ బావిలో పడ్డ కారు అద్దాలు పగులగొట్టి ముగ్గురిని రక్షించారు.
అసలేం జరిగింది?
మహబూబాబాద్ జిల్లాలో దుర్ఘటన జరిగింది. ప్రమాదవశాత్తూ ఓ కారు బావిలో పడింది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురిని స్థానికులు రక్షించారు. కేసముద్రం శివారులోని బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన వారుగా తెలుస్తోంది. పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. లిఫ్ట్ అడిగితే ఇచ్చామని ప్రమాదం నుంచి బయటపడిన వారు అంటున్నారు.