Munugode By Elections: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. గట్టుప్పల్ మండలం రంగంతండా గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని.. గతంలో చాలా సార్లు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా నాయకులు స్పందించాలని అప్పటి వరకు ఓటు వేయమంటూ నిరసన చేపట్టారు. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఓటు వేయమని హెచ్చరించారు. 


మంత్రి కేటీఆర్ హామీతో ఓటు వేస్తున్న గ్రామస్థులు..


అయితే విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్పందించారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు మంత్రి కేటీఆర్ తో ఫోన్ మాట్లాడించారు. మొదట పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోండి.. త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు ఓటు వేసేందుకు వెళ్లారు. ప్రస్తుతం రంగంతండాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 


మరోవైపు  బీజేపీపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్


తెలంగాణ బీజేపీపై ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నియోజక వర్గంలో భారీగా మద్యం, నగదు పంపిణీ చేస్తున్నారని తెలిపింది. అయితే బీజేపీపై ఫిర్యాదు చేసేందుకు మంత్రి జగదీష్ రెడ్డి  రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఈరోజు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ని కలిసి మునుగోడులో జరుగుతున్న పరిస్థితులను గురించి వివరించే ప్రయత్నం చేశారు. 


మద్యం, నగదు పంపిణీతో పాటు వారి నిరసనలూ ఆపండి..


ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణం, నారాయణపేటలోని జనగామ, చండూరు, మర్రిగూడలోని తమ్మలపల్లి వంటి గ్రామాల్లో భారీ ఎత్తున బీజేపీ మద్యం, నగదును పంపిణీ చేస్తుందని తెలిపారు. అక్రమంగా కాషాయ దళం నేతలు మద్యం, డబ్బులు పంపిణీ చేయడాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం రాత్రి నుంచి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ధర్నాలు, నిరసనలు చేయడంతోపాటు ఈరోజు భారీగా నగదు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. అడగడానికి వెళ్లిన క్షేత్రస్థాయి అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో ఎలక్షన్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి వికాస్ రాజ్ ని కోరారు. 


నిన్న రాత్రి రాజగోపాల్ రెడ్డి ధర్నా..


అర్థరాత్రి మునుగోడు నియోజకవర్గం చండూరులో హైడ్రామా నడిచింది. నియోజకవర్గం వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు మకాం వేసి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి ధర్నా చేశారు. చండూర్ ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు. తన అనుచరులతో వచ్చి ఆర్వోతో మాట్లాడారు. అనంతరం ఆర్వో కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం తాను రాజీనామా చేశానని... ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజగోపాల్ రెడ్డి. రూల్స్‌కు విరుద్ధంగా తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే మకాం వేశారని ఆరోపించారు. అధికారులు పట్టించుకోవట్లేదంటూ ధర్నాకు దిగారు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకలు ఇళ్లల్లోనే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని తెలిపారు.