మునుగోడు ఉప ఎన్నికల ఊపులో బీజేపీలో చేరుతున్నట్లుగా టీఆర్ఎస్ నేత బూర నర్సయ్య గౌడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనతో పాటు బీజేపీలోకి మరో ఇద్దరు నేతలు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బుధవారం (అక్టోబరు 19)న బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన బీజేపీ కండువా కప్పుకునే సమయంలోనే కాంగ్రెస్‌ నేత వడ్డేపల్లి నర్సింగ్‌రావు కుమారుడు కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన వడ్డేపల్లి రాజేశ్వర్‌రావు, వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ (మాజీ ఎమ్మెల్యే నారాయణ్‌ రావు సోదరుడు) కుమారుడు నరేశ్‌ ముదిరాజ్‌తో పాటు మహబూబ్‌నగర్‌కు చెందిన మరో లీడర్ కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. నేతలు బీజేపీలో చేరే ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, ఇతర నేతలు హాజరు అవనున్నారు.


బుధవారం (అక్టోబరు 19) మధ్యాహ్నం 12 గంటలకు బూర నర్సయ్య గౌడ్ బీజేపీ కండువా కప్పుకుంటారు. ఇందుకోసం బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు ఢిల్లీ వెళ్లగా, ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బీజేపీలో చేరిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మరోసారి బూర నర్సయ్య గౌడ్ కలవనున్నట్లు తెలుస్తోంది. 


కేసీఆర్ బూర అసంతృప్తి
మునుగోడు ఉప ఎన్నిక విషయంలో తనను పార్టీ సంప్రదించలేదని బూర నర్సయ్య గౌడ్ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మునుగోడు టికెట్ ను ఆశించారు. కానీ, సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వచ్చారు. తనకు పార్టీలో అవమానం జరిగిందని, తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదంటూ అందుకే రాజీనామా చేసినట్లు బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. ఇదిలా ఉంటే బూర నర్సయ్య గౌడ్ కు టీఆర్ఎస్ పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని ఆయన పార్టీని వీడడం వల్ల టీఆర్ఎస్ కి వచ్చిన నష్టం ఏమీ లేదని గులాబీ నేతలు అంటున్నారు.


టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ కు బూర నర్సయ్య గౌడ్ కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమం, పార్టీ ప్రస్థానంలో తాను పోషించిన కీలక పాత్ర గురించి లేఖలో ప్రస్తావించారు. 2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. 2013 సంవత్సరంలో టీఆర్‌ఎస్‌లో చేరిన బూర నర్సయ్య గౌడ్ 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆశించారు. కానీ, అది కూడా లేకపోవడంతోనే బూర కొన్నాళ్లుగా అసహనంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.