Mulugu News :ములుగు జిల్లాలో ఇప్పుడు రియల్ కింగ్ ల దందా కొనసాగుతోంది. బర్త్ డే గిఫ్ట్ గా 2019 ఫిబ్రవరి 17న ములుగును జిల్లాగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ నాలుగేళ్లైనా అన్ని శాఖల భవనాలు లేకపోవడంతోపాటు కలెక్టరేట్ భవన నిర్మాణంలో కూడా ఆలస్యం జరుగుతోంది. అయితే రియల్ దందా మాత్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లుతోంది.
కానరాని నిబంధనలు
డీటీసీపీ (డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) శాఖను ములుగులో ఏర్పాటు చేయకపోవడంతో గ్రామపంచాయతీ అధికారుల హవా కొనసాగుతోంది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల పేరు చెబుతూ అందిన కాడికి దోచుకొని వ్యవసాయ భూములను కన్వర్షన్లు లేకుండానే వెంచర్లు చేస్తూ ప్రభుత్వ ఖజనాకు తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ చేయాలంటే అందుకు తగిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. చేసిన వెంచర్ లో కొంత భూమిని ప్రభుత్వం పేరున రిజిస్ర్టేషన్ చేయడంతోపాటు ఆలయం, పార్కు, ఆటస్థలం, నీటి వసతికి ట్యాంకు తదితర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా కేంద్రంలో రియల్ వ్యాపారం విస్తరిస్తుందే తప్ప నిబంధనలను పాతరేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వార్డు సభ్యుల తిరుగుబాటు
తరచూ రియల్ ఎస్టేట్ వెంచర్లపై అధికారులు దాడులు చేస్తూ రాళ్లను తొలగించిన ఘటనలు ఉన్నాయి. అయితే కొద్ది రోజులకే ముడుపులు దండుకొని తిరిగి వెంచర్లు వేసుకునేందుకు దారులు తెరిచినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో అడిషనల్ కలెక్టర్ త్రిపాఠి వద్దకు వెళ్లిన కొందరు వార్డు సభ్యులు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఫిర్యాదులు చేశారు. దానిపై స్పందించిన అదనపు కలెక్టర్ వెంటనే అనుమతి లేని వెంచర్లలో రాళ్లు తొలగించాలని ఆదేశించారు. అనంతరం మళ్లీ రియల్ హవా కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం ములుగు గ్రామపంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు ప్రేమ్ నగర్ సమీపంలోని రియల్ వెంచర్ లోని రాళ్లను తొలగించారు. దీంతో రియల్ వ్యాపారులు ఆ స్థలానికి చేరుకొని వార్డు సభ్యులతో వాగ్వివాదానికి దిగినట్లు సభ్యులు ఆరోపించారు. తాము అధికారుల ఆదేశాల మేరకు రూ.2 కోట్లు గ్రామపంచాయతీ అభివృద్ధికి అందజేశామని వ్యాపారులు తెగేసి చెప్పినట్లు వార్డు సభ్యులు చెబుతున్నారు. అయితే ఎవరికి ఇచ్చారనేది తెలియలేదన్నారు. ఆ సొమ్ము ఎవరికి ఇచ్చారనేది ఉన్నతాధికారులు తేల్చాలని, ముడుపులు తీసుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లు!
ఈ విషయం ఇలా ఉండగా ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అడిషనల్ కలెక్టర్ వై.వి.గణేష్ ను బుధవారం కలిసి నిబంధనలకు విరుద్ధంగా రియల్ దందా చేస్తున్న వెంచర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ములుగు సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు రియల్ దందాను ఆసరాగా చేసుకొని ఒత్తిళ్లు తెస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. మొత్తంగా ఈ వ్యవహారం ములుగులో రాజకీయ దుమారం లేపుతోంది. అయితే రియల్ వ్యాపారులు మాత్రం ములుగు పట్టణం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగాలనే వాదనలు వినిపిస్తున్నారు. ములుగులో డీటీసీపీ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.