గత కొన్నేళ్లుగా క్యాంపస్‌లలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయి. కారణాలు ఏవైనా సరే.. వర్సిటీ క్యాంపస్‌లలో చదువుకుంటున్న మెరిట్ విద్యార్థులు బలవన్మరణం చెందడం విషాదదాయకం. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (హెచ్‌సీయూ) విషాదం చోటుచేసుకుంది. ఆర్.మౌనిక (27) అనే ఎంటెక్ విద్యార్థిని వసతి గృహంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన రఘుశాల లచ్చయ్య, రజిత దంపతుల కుమార్తె మౌనిక.. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో ఎంటెక్ నానో టెక్నాలజీ విభాగంలో సెకండియర్ చదువుతోంది. ఆమె వర్సిటీలోని మహిళా వసతి గృహంలో ఉంటోంది.
ఆదివారం ఉదయం నుంచి మౌనిక తన గది నుంచి బయటకు రాలేదు. తోటి విద్యార్థినిలు ఎంత పిలిచినా స్పందన రాలేదు. దీంతో వాళ్లు వెంటిలేటర్‌లో నుంచి లోపలికి చూడగా కిటికీ చువ్వకు ఉరివేసుకుని మౌనిక కనిపించింది. వెంటనే తోటి విద్యార్థినులు వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read: Harish Rao: తెలంగాణ నిజంగా అప్పుల్లో కూరుకుపోయిందా? సీఎం కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం ఉందా..! మంత్రి హరీశ్ రావు క్లారిటీ
గదిలో సూసైడ్ లెటర్ లభ్యం..
ఆత్మహత్య చేసుకున్న మౌనిక గదిలో ఒక సూసైడ్ లెటర్ లభించింది. అందులో 'ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యూ నాన్న.. అమ్మ’ అని రాసి ఉంది. మౌనికది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె తండ్రి గ్రామంలోనే వ్యవసాయం చేస్తుంటారు. పదో తరగతి వరకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివింది. ఆ తర్వాత బాసర ట్రిపుల్ ఐటీలో సీటు రావడంతో, అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం హెచ్‌సీయూలో ఎంటెక్ చదువుతోంది. ఎంటెక్ విద్యార్థులను క్యాంపస్‌లోకి అనుమతించడంతో ఈ నెల 18న ఆమె వర్సిటీకి వచ్చింది. అప్పటినుంచి హాస్టల్‌లోనే ఉంటోంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.
Also read: Konda Surekha: రంగంలోకి కొండా సురేఖ దంపతులు.. ఆ కార్యక్రమంతోనే జనంలోకి.. చివరి సభకు రాహుల్ హాజరు