తెలంగాణలో కేసీఆర్ ఉన్నంత కాలం రాష్ట్రంలో మిగతా పార్టీలన్నీ రెండో స్థానం కోసమే కొట్లాడాలని, మొదటి స్థానానికి రాలేరని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీనే ప్రథమ స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తామేనని కొట్టుకోవడంలో అర్థం లేదని అన్నారు. ప్రజా సమస్యలు లేకపోవడమే ప్రతిపక్షాలకు ఇబ్బందిగా మారిందని విమర్శించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై మంత్రి హరీశ్ రావు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ 11వ పెద్ద రాష్ట్రమని, తలసరి ఆదాయంలో తెలంగాణ అత్యధిక వార్షిక వృద్ధి రేటు నమోదైందని అన్నారు. రాష్ట్రం వచ్చిన ఏడేళ్లలో తెలంగాణ ఏడు రాష్ట్రాలను అధిగమించిందని అన్నారు. వరి సాగులో తెలంగాణ అతి పెద్ద రాష్ట్రంగా అవతరించిందని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అత్యధిక వార్షిక వృద్ధి రేటు నమోదైందని అన్నారు. పత్తి ఉత్పత్తిలోనూ తెలంగాణ ముందుందని హరీశ్ రావు చెప్పారు.
కరోనా వంటి క్షిష్ట సమయంలో కూడా తెలంగాణ పాజిటివ్ వృద్ధి రేటు సాధించిందన్నారు. జీఎస్‌డీపీ విషయంలో గత ఆరు సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏటా సరాసరిన 11.7 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోందని తెలిపారు. అదే సమయంలో భారత దేశ వృద్ధి రేటు కేవలం 8.1 శాతమే ఉందని గుర్తు చేశారు. గత ఆరేళ్లలో 3.7 శాతం అదనపు వృద్ధిరేటును తెలంగాణ నమోదు చేసిందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రణాళిక బద్ధమైన పాలన, ఆయన అవలంబించే పాలన వల్ల ఈ ఫలాలు సాధించామని వెల్లడించారు.
బంగ్లాదేశ్ కన్నా తక్కువగా దేశ వృద్ధి రేటు
‘‘బంగ్లాదేశ్‌తో పోల్చి చూస్తే కూడా భారత దేశ జీడీపీ వృద్ధి రేటు తక్కువగా ఉంది. 2014-15 నుంచి భారత వృద్ధి రేటు తగ్గుతుండగా.. బంగ్లాదేశ్ వృద్ధిరేటు పెరుగుతూ పోయింది. అంటే భారత దేశ ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కన్నా పడిపోయింది. ఇదీ మీ ప్రభుత్వం సాధించిన పురోగతి. మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే బంగ్లాదేశ్ కన్నా తక్కువ స్థాయికి వృద్ధి రేటు తీసుకుపోవడం. తలసరి ఆదాయం, జీడీపీ విషయం రెండిట్లో భారత్ వెనుకబడి ఉంది.’’ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
మనమే నెంబర్ 1..
‘‘దక్షిణ భారతంలోని రాష్ట్రాలతో తెలంగాణను పోల్చి చూస్తే జీఎస్డీపీ వృద్ధి రేటులో మనమే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. గత 6 సంవత్సరాల్లో ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలను పోల్చి చూస్తే సరాసరిన 11.7 శాతం వృద్ధి రేటు నమోదు చేశాం. ఏపీ 11.2 శాతం, కర్ణాటక 10.6, కేరళ 10.8, తమిళనాడు 10.1 శాతంగా ఉన్నాయి. కరోనా సమయంలో కూడా మనం 2 శాతం వృద్ధి రేటును నమోదు చేశాం.’’
దేశం కన్నా ఎక్కువగా తెలంగాణ తలసరి ఆదాయం
‘‘దేశం కన్నా తెలంగాణ తలసరి ఆదాయమే ఎక్కువ. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 గా ఉండేది. తెలంగాణ తలసరి ఆదాయం విషయంలో 2020-21 ఏడాదికి గానూ రూ.2,37,632 గా ఉంది. జాతీయ సరాసరి తలసరి ఆదాయంతో పోల్చితే 1.84 రెట్లు మనం ముందున్నాం. దేశ తలసరి ఆదాయం రూ.1,28,829 గా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632 గా ఉంది. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణలో ఎక్కువగా ఉంది. దేశంలోనే మూడో అతిపెద్ద తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉంది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 10వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశంలోనే మూడో స్థానంలోకి వచ్చింది.’’
‘‘తలసరి ఆదాయం విషయంలో దేశ వృద్ధి రేటు గత ఆరేళ్లలో 48.7 శాతంగా ఉంది. తెలంగాణ విషయంలో అది 91.5 శాతంగా ఉంది. దేశంలోనే తలసరి ఆదాయం వృద్ధి రేటులో మనమే రెండో స్థానంలో ఉన్నాం. కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి వారు ఎవరి పనితీరు బాగుందో చెప్పాలి. 2014-15 నుంచి 2020-21 వరకూ ఏటా తెలంగాణ వృద్ధి రేటు 10వ స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చింది. ఒక నిబద్ధతతో ప్రభుత్వం పని చేస్తుందని చెప్పేందుకు ఇదే ఉదాహరణ.’’
అప్పుల విషయంలో నిజాలివీ..
‘‘రాష్ట్రంలో అప్పులు బాగా పెరిగిపోయాయని కొందరు అంటున్నారు. వాటి గురించిన వాస్తవాలు కూడా మీముందు పెడతాం. నిజానికి రాష్ట్రాలకు ఎంతంటే అంత అప్పు తీసుకునే అవకాశం లేదు. ఆ విషయంలో పరిమితిని కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. అప్పులు చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ హద్దులు మీరలేదు. జీఎస్డీపీలో 25 శాతానికి అప్పులు మించకూడదనే కేంద్రం విధించిన నిబంధన ఉంది. మన రాష్ట్రం తీసుకున్న అప్పులు జీఎస్డీపీలో 22.83 శాతంగా అప్పులతో హద్దుల్లోనే ఉంది. చాలా రాష్ట్రాలు దాన్ని దాటిపోయాయి. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే పంజాబ్ దాదాపు 38.67 శాతం అప్పులు చేసింది. పశ్చిమ్ బంగాల్ 34.67, రాజస్థాన్ 34.54, యూపీ 33.8, ఏపీ 32.67, బిహార్ 30.79, కేరళ 30.30, మధ్య ప్రదేశ్ 29.35, గోవాలో 28.07, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు కూడా అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితిని దాటేశాయి.’’
అప్పులను సద్వినియోగం చేసుకున్నాం
‘‘అంతేకాక, మనం హద్దుల్లో చేసిన అప్పులను సద్వినియోగం చేశాం. వాటిని సక్రమంగా ఖర్చు పెట్టాం. ఉత్పాదక రంగాలపై పెట్టుబడులు పెట్టడం వల్లే జీఎస్డీపీ, తలసరి ఆదాయం, పన్నుల పెరుగుదలకు దోహదం చేశాయి.’’ అని హరీశ్ రావు వివరించారు.