పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను గంటన్నరపాటు ప్రసంగించి ప్రవేశపెడితే.. దాని గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నర గంటలపాటు ఏక పాత్రాభినయం చేశారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఒక కల్తీ మందు తాగి వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ గురించి నీచంగా, అత్యంత జుగుప్సాకరంగా కేసీఆర్ మాట్లాడారని రేవంత్ విమర్శించారు. పార్లమెంటు సమావేశాలకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ బుధవారం మీడియాతో మాట్లాడారు.
కేంద్ర బడ్జెట్ 2022తో శ్రీమంతులకే ప్రయోజనం ఉందని, పేదలకు, మధ్యతరగతి వారికి ఎలాంటి లాభం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌పై నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌లో చిత్రవిచిత్రంగా మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్ మాటలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేసీఆర్ అడగనేలేదని అన్నారు. విభజన చట్టం అంశాలు, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ యూనిట్, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల విషయం ఏదీ మాట్లాడలేదని అన్నారు.
బీజేపీ ఆలోచనే కేసీఆర్ మాట ద్వారా..
కొత్త రాజ్యాంగం తేవాలనే ఆలోచన బీజేపీ కుట్ర అని.. వారి ఆలోచనను కేసీఆర్ ద్వారా బయటకు వదిలారని రేవంత్ విమర్శించారు. రాజ్యాంగం రద్దు చేయాలని బీజేపీ ఎన్నో ఏళ్లుగా కుట్ర చేస్తోందని.. కేసీఆర్‌ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశాన్ని తెరమీదికి తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. భూస్వాములు, పెట్టుబడిదారుల కోసం కొత్త రాజ్యాంగం కోరుతున్నారా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ యోచన అని అన్నారు.
జనం నాలుక కోస్తారు: రేవంత్
సీఎం వ్యాఖ్యలకు నిరసనగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకునేందుకు రెండు రోజుల పాటు గాంధీ భవన్‌లో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ ఆలోచనను ఉపసంహరించుకొకపోతే దేశ యువత కేసీఆర్ నాలుక కోస్తారని రేవంత్ వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ..
అంతకుముందు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ‘‘ఎన్నికల సమయంలో హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కానీ కనీసం కాలుష్యం లేని నగరంగా కూడా చేయలేకపోయారు. విశ్వనగరం సంగతి పక్కన ఉంచితే జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో కూడా హామీ నెరవేరలేదు. మూడేళ్ల క్రితం ఇక్కడి డంపింగ్ యార్డ్ మారుస్తామని చెప్పిన హామీ ఇంత వరకు నెరవేర్చలేదు. నా పార్లమెంట్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల విష వాయువులు వెలువడి ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయని మీకు జాయింట్ యాక్షన్ కమిటీ అనేక సార్లు చెప్పింది. ఇప్పటికైనా డంప్ యార్డ్‌ను తరలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి’’ అని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.