Motkupalli : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ తనకు టిక్కెట్ హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని కానీ ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా దీక్ష చేసిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని అనుకోవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల వ్యవహారాలు చూస్తున్న డీకే శివకుమార్ ను.. మోత్కుపల్లి బెంగళూరులో కలిశారు. కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చిందని.. అన్ని విషయాలు హైదరాబాద్‌లో చెబుతానని ఆయన ప్రకటించారు. 


 





టీడీపీ లో సుదీర్ఘ కాలం పని చేసిన మోత్కుపల్లి 


మోత్కుపల్లి కాంగ్రెస్ లో చేరాలని ఆలోచనతో  మందుగా స్థానిక హస్తం నేతలతో, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కూడా సంప్రదించారు.  మోత్కుపల్లి టీడీపీలో మొదట నుంచి పనిచేశారు. దశాబ్దాల పాటు పార్టీలో ఉన్నారు.  ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని కూడా పొందారు. తర్వాత మోత్కుపల్లి 2009లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి వెంకటేశ్వరరావు సహకారంతో పదివేల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత ఎన్నికల్లో ఓటమిపాలై కొన్నాళ్లకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నెక్స్ట్ బి‌జే‌పిలోకి వెళ్లారు. తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. అక్కడ ప్రాధాన్యత లేకపోవడంతో కాంగ్రెస్ లోకి రావాలని చూస్తున్నారు. 


మోత్కుపల్లి కి కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తుందా ? 
 
మోత్కుపల్లికి టిక్కెట్ లభిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ నుంచి మందుల సామేలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇటు గత రెండు ఎన్నికల్లో గెలుపు వరకు పొరాడి తక్కువ మెజారిటీలతో ఓడిపోయిన అద్దంకి దయాకర్ ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు మోత్కుపల్లి వస్తానని అంటున్నారు. దీంతో తుంగతుర్తి కాంగ్రెస్ లో మూడు ముక్కలాట జరిగేలా ఉంది.  ఇప్పటికే తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ మరి ఈసారి టికెట్ వస్తుందో లేదో అని ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అదిస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎన్నికల వరకు వేచి చూస్తే తప్ప తెలియదు.


ఇటీవలే సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు 


గత ఎన్నికల్లో జగన్ విజయం కోసం మోత్కుపల్లి పని చేశారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మోత్కుపల్లి జగన్ ను విమర్శించారు.  గతంలో ఏపీలో జగన్ విజయం సాధించాలని కోరుతూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడానని ... ప్పుడు అలా మాట్లాడినందుకు ఇప్పుడు సిగ్గుతో తలదించుకుంటున్నానని ప్రకటించారు.  గత ఎన్నికల్లో జగన్ విజయానికి సహకరించిన ప్రతీ ఒక్కరూ ఇవాళ తలదించుకొనే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు కుటుంబాన్ని చంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. చంద్రబాబు చనిపోతే తమకు ఎదురుండదని సీఎం జగన్ భావిస్తున్నారన్నారు. త్వరలో రాజమండ్రి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలుపుతానన్నారు.