అక్రమంగా వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు పౌరసత్వం ఇవ్వడం పట్ల తాను వ్యతిరేకమని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న రిపబ్లికన్‌ పార్టీ నేత వివేక్‌ రామస్వామి స్పష్టంచేశారు. కాలిఫోర్నియాలోని సిమీవ్యాలీలో బుధవారం జరిగిన రిపబ్లికన్‌ అభ్యర్థుల రెండో చర్చావేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన వారి పిల్లల పౌరసత్వం రద్దు చేయడానికే తాను మద్దతిస్తానని చెప్పారు. భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి మొదటి చర్చా వేదికలో కూడా బాగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. మిలాక్వీలో జరిగిన తొలి చర్చా వేదికకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరుకాలేదు. కాగా రెండో చర్చా వేదికకు కూడా రాలేదు. రెండో చర్చలో ఏడుగురు సభ్యులు మాట్లాడారు. నార్త్‌ డకోటా గవర్నర్‌ డౌగ్‌ బర్గమ్‌, న్యూజెర్సీ మాజీ గవర్నర్‌ క్రిస్‌ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిసాంటిస్‌, ఐక్య రాజ్య సమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ, మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, సౌత్‌ కరొలినా సెనేటర్‌ టిమ్‌ స్కాట్‌లు ప్రసంగించారు.


వివేక్‌ ఈ సమావేశంలో మాట్లాడుతూ అమెరికా దక్షిణ సరిహద్దును సైనికీకరణ చేస్తానని, మెక్సికోతో పాటు అమెరికా దేశాలకు విదేశీ సాయాన్ని నిలిపేస్తానని తెలిపారు. చట్టాలు, అధికార పరిధిలకు లోబడి అమెరికా జన్మించిన పిల్లలకు బర్త్‌రైట్‌ సిటిజన్‌షిప్‌ లభిస్తోంది. అయితే ఒక మెక్సికన్‌ దైత్యవేత్త పిల్లాడు ఇక్కడ సిటిజన్‌షిప్‌ అనుభవిస్తున్నాడు, ఇది నమ్మలేకుండా అనిపిస్తోంది అని వివేక్ పేర్కొన్నారు. పత్రాలు లేని వలసదారులను, వారికి అమెరికాలో జన్మించిన పిల్లలను దేశం నుంచి ఎలా బహిష్కరిస్తారని వివేక్‌ను అడిగిన ప్రశ్నకు.. ఆయన అప్పటి అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ 2015లో ప్రతిపాదించిన జన్మతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసే విధానం తీసుకురావాలని వెల్లడించినట్లు తెలుస్తోంది. చర్చ తర్వాత మొదటి పోల్‌ ప్రకారం.. పోల్‌లో పాల్గొన్న 504 మందిలో 28శాతం మంది వివేక్ రామస్వామి ఉత్తమ ప్రదర్శన చేశారని చెప్పారు.


వివేక్‌ రామస్వామి గతంలో మాట్లాడినప్పుడు హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ను విమర్శించారు. ప్రస్తుత లాటరీ వ్యవస్థను మరింత కఠినం చేయాలని, దీనికి బదులు మెరిటి ఆధారంగా వీసాలు అందించే స్కీమ్‌తో భర్తీ చేయాలని అన్నారు. భారత ఐటీ ప్రొఫెషనల్స్‌ ఎక్కువగా హెచ్‌-1బీ వీసాపై ఆధారపడి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది వలసేతర వీసా. దీని ద్వారా అమెరికాలోని కంపెనీలలో సాంకేతిక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలకు అనుమతి ఉంటుంది. 


రెండో చర్చా వేదికకు కూడా ట్రంప్‌ హాజరుకాకపోవడంపై ఇతర అభ్యర్థులు విమర్శలు చేశారు. ట్రంప్‌ బహిరంగ చర్చకు రాకపోవడంపై న్యూజెర్సీ గవర్నర్‌ క్రిస్‌ క్రిస్టీ విమర్శించారు. ట్రంప్‌ తన గోల్ఫ్‌ క్లబ్‌ గోడల వెనుక దాక్కుంటున్నారని అన్నారు. ట్రంప్‌ చర్చా కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని.. ఇలా చేస్తే తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను అని అన్నారు. ప్రతి సారీ ఇలాగే చేస్తే మిమ్మల్ని ఇక మీదట డొనాల్డ్‌ ట్రంప్‌ అని కాకుండా డొనాల్డ్‌ డక్‌ అని పిలుస్తారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.