World Cup 2023: 


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023కి శుక్రవారం అంకురార్పరణ జరుగుతోంది! నేటి నుంచే వార్మప్‌ మ్యాచులు మొదలవుతున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల జట్లు భారత్‌కు వచ్చేశాయి. తమకు కేటాయించిన స్టేడియాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్నాయి. ప్రధాన జట్లు ట్రోఫీ గెలిచేందుకు చాన్నాళ్ల క్రితమే వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. అందుకు తగ్గ ఆటగాళ్లను ఎంపిక చేశాయి.


ఈ మెగా టోర్నీలో మొత్తం 10 సన్నాహక మ్యాచులు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచులు మొదలవుతాయి. అరగంట ముందే టాస్‌ వేస్తారు. రాత్రి 10 గంటలకు మ్యాచ్‌లు ముగుస్తాయి. శుక్రవారం మూడు సన్నాహక పోటీలు ఉన్నాయి. శని, ఆదివారాల్లో రెండు చొప్పున, సోమవారం మూడు మ్యాచులు జరుగుతాయి. పోటీలన్నీ స్టార్‌స్పోర్ట్స్‌ ఛానళ్లు, డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ప్రసారం అవుతున్నాయి. మొబైల్‌ వరకు హాట్‌స్టార్‌లో ఉచితంగా వీక్షించొచ్చు.


శుక్రవారం గువాహటిలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు మొదటి సన్నాహక మ్యాచ్‌ ఆడనున్నాయి. అఫ్గానిస్థాన్‌, దక్షిణాఫ్రికా తిరువనంతపురంలో తలపడతాయి. కీలకమైన న్యూజిలాండ్‌, పాకిస్థాన్ వార్మప్‌ మ్యాచ్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతోంది.


టీమ్‌ఇండియా తొలి సన్నాహక మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది. శనివారం గువాహటిలో ఈ పోరు ఉంటుంది. ఇక తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో ఆస్ట్రేలియా పోటీపడుతుంది. భారత్‌ రెండో సన్నాహక మ్యాచును మంగళవారం తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో ఆడుతుంది.


పాక్‌, న్యూజిలాండ్‌ మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చు. గురువారం సైతం నగర వ్యాప్తంగా వరుణుడు వాన కురిపించాడు. శుక్రవారం సైతం ఉదయం మబ్బులు కమ్మాయి. సాయంత్రం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. జల్లులు కురిస్తే ఈ మ్యాచుకు ఒకట్రెండు సార్లు అంతరాయం కలగొచ్చు.


న్యూజిలాండ్‌ జట్టు: కేన్ విలియమ్సన్  (కెప్టెన్), ట్రెంట్ బౌల్డ్, మార్క్ చాప్‌మన్, డేవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాథ్యూ హెన్రీ, టామ్ లేథమ్ (వికెట్ కీపర్),  డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి,  టిమ్ సౌథీ, విల్ యంగ్


పాక్ జట్టు జాబితా: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హ్యారిస్ రౌఫ్,  హసన్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, ఇమాముల్ హక్, మహ్మద్ వసీమ్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్ షకీల్, షాహిన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్


రిజర్వ్ ఆటగాళ్లుగా మహ్మద్ హారిస్, అబ్రార్ అహ్మద్, జమాన్ ఖాన్