Security Arrangements for Loksabha Elections in Telngana: హైదరాబాద్: ఈసీ నిబంధనల ప్రకారం ఏపీ, తెలంగాణతో పాటు ఎన్నికలు జరగనున్న చోట ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకే ముగిసింది. మే 11 సాయంత్రం 6 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం పోలీసుల ప్రాథమిక విధి అన్నారు. తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలలో మే 13న జరగనున్న ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.


 పటిష్ట భద్రత, భారీ బందోబస్తు 
ఎన్నికల సమయంలో శాంతి భద్రతల కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ రవి గుప్తా తెలిపారు. 73,414 మంది సివిల్ పోలీసులు, 500 తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ విభాగాలు, 164 సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు. వీరితో పాటు తమిళనాడుకు చెందిన 3 స్పెషల్ ఆర్మ్స్ కంపెనీలు, 2088 ఇతర శాఖల సిబ్బంది. 7,000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులు ఉంటారని డిజిపి తెలిపారు.


మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం తెలంగాణ పోలీసులు భద్రతా తనిఖీ కేంద్రాల నెట్వర్క్ ను ఏర్పాటు చేశారు. ఈ నెట్ వర్క్ 482 ఫిక్స్డ్ స్టాటిక్ టీమ్ లు (FSTలు), 462 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లు (SSTలు), 89 అంతర్ రాష్ట్ర బోర్డర్ చెక్ పోస్టులు, 173 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. డబ్బు, మద్యం లేదా ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణా ప్రయత్నాలను అడ్డుకోవడానికి మొబైల్ పోలీసు విభాగాలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవిగుప్తా వివరించారు.


ఇప్పటివరకు ఎంత సీజ్ చేశారంటే.. 
2024 మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ పోలీసులు రూ. 186.14 కోట్ల నగదుతో పాటు మద్యం, మాదక ద్రవ్యాలు, విలువైన వస్తువులను జప్తు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఇందులో నగదు రూ.93 కోట్ల 94 లక్షల 43 వేల 3 వందల 58 సీజ్ చేశారు. 10 కోట్ల 7 లక్షల 49 వేల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. 7 కోట్ల 86 లక్షల 32 వేల విలువ చేసే డ్రగ్స్ తో పాటు 11 కోట్ల 48 లక్షల 88 వేల 4 వందల 59 విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 62 లక్షల 77 వేల 4 వందల 80 రూపాయల విలువ చేసే 91 కేజీల బంగారంతో పాటు 166 కేజీల వెండిని పోలీసులు సీజ్ చేసినట్లు రవి గుప్తా తెలిపారు.


తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎక్సైజ్ చట్టం, మాదకద్రవ్యాల చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ (IPC), ప్రజాప్రాతినిధ్య చట్టం (RP చట్టం) కింద నేరాలకు సంబంధించి కేసులు నమోదు చేశారని డీజీపీ వివరించారు. ఎక్సైజ్ యాక్ట్ కింద 8044 కేసులు నమోదు కాగా, నార్కొటిక్స్ కింద 293 కేసులు, ఇతర ఐపీసీ సెక్షన్ల కింద 473 కేసులు, ఆర్పీ యాక్ట్ కింద 53 కేసులు కలిపి మొత్తం 8,863 ఎఫ్ఐఆర్ లు రాష్ట్ర పోలీసులు నమోదు చేశారు. రౌడీలను, ఎన్నికలలో నేరాలకు పాల్పడే వారిని గుర్తించి 34,526 మందిని చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి ఉండేలా బైండోవర్ చేశామన్నారు. 


తెలంగాణ డిజిపి కార్యాలయంలో కేంద్రీకృత కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని రవిగుప్తా తెలిపారు. మే 12 ఉదయం 7 గంటల నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని వెల్లడించారు. చివరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) స్ట్రాంగ్ రూమ్ లో సురక్షితంగా ఉంచే వరకు ఈ కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేస్తుందన్నారు. పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ సూచించారు.