Mandaviya VS KTR: రాష్ట్ర మంత్రి కేటీఆర్ మెడికల్ కాలేజీల అంశంపై కేంద్రంపై విమర్శలు చేశారు. తాము ఎన్నిసార్లు కోరినా కేంద్రం స్పందించలేదని, పైగా తెలంగాణ ప్రభుత్వంపైనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని, సాక్ష్యాలు చూడాలంటూ కొన్ని స్క్రీన్ షాట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ స్పందించారు. దీంతో వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ జరిగింది.


ఎన్ని ప్రతిపాదనలు చేశారు: కేంద్ర మంత్రి ప్రశ్న
తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ ట్వీట్ కు బదులుగా.. తెలంగాణ ప్రభుత్వం నుంచి వైద్య కళాశాలల ఏర్పాటుకు ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయని మాండవీయ ప్రశ్నించారు. తెలంగాణ సర్కారు నుంచి వైద్య శాలల ఏర్పాటుకు ఒక్క ప్రతిపాదన కూడా రాలేదని స్పష్టం చేశారు. స్వల్ప కాలంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక సంఖ్యలో దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలలు మంజూరు చేశారని తెలిపారు. ఎలాంటి పక్షపాతం, వివక్షలు లేకుండా ప్రతిపాదనలు పంపిన రాష్ట్రాలకు వైద్య కళాశాలలు ఇచ్చామని వివరించారు. 






ఘాటుగా స్పందించిన మంత్రి కేటీఆర్.. 
కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ్ చేసిన ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందించారు. వైద్య కళాశాలల కోసం 2015వ సంవత్సరం నుంచి 2019 వరకు కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖలను సాక్ష్యాలుగా ట్వీట్ తో జతపరిచారు. పలుమార్లు మెడికల్ కళాశాలలు కావాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రులకు లేఖలు రాసినా.. పట్టించుకోలేదని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ లో ఉన్న 544 ఖాళీలలను కూడా కేంద్రం భర్తీ చేయలేదని ఆరోపించారు. బీబీనగర్ ఎయిమ్స్ ను కూడా యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క విద్యా సంస్థను కూడా ఇవ్వలేదని.. ఇదే నిజం అంటూ మాండవీయ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. 






కేటీఆర్ ఇచ్చిన ఈ రిప్లై కి మాండవీయ కూడా మరో ట్వీట్‌లో రిప్లై ఇచ్చారు. గత కేంద్ర మంత్రులు రాసిన లేఖలు, పార్లమెంటులో ఇచ్చిన సమాధానంలోని అంశాలను జాగ్రత్తగా చదవాలని సూచించారు. పథకం విధివిధానాలకు లోబడి డీపీఆర్ తో కూడిన ప్రతిపాదనలు పంపాలని సూచించినట్లు పేర్కొన్నారు. కేవలం ఓ సాధారణ లేఖ రాయడం వేరు, పథక నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు పంపడం వేరని వివరించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మీ కేబినేట్ సహచరుడు.. కేంద్ర ప్రభుత్వం 9 వైద్య కళాశాలల మంజూరు చేసినట్లు పేర్కొన్నారని గుర్తు చేశారు. గవర్నర్ కూడా ఇదే మాట అన్నారని తెలిపారు. మీరేమో ఇప్పుడు తెలంగాణ అసలు దరఖాస్తే చేయలేదని చెప్పడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. 






ఉత్తర ప్రదేశ్ 14 వైద్య కళాశాలలు అడిగితే.. 27 ఇచ్చినట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్ లో సమాధానం చెప్పారని.. రాష్ట్రాలపై ఈ పక్షపాత ధోరణి ఎందుకుంటూ ప్రశ్నించారు. మాండవీయ ట్వీట్ పై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా స్పందించారు. బాధ్యాతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు నిర్లక్ష్యపూరితంగా సమాధాన చెప్పడం సరికాదని కేంద్ర మంత్రికి సూచించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తెలంగాణ సంక్షేమం పట్ల బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయన్నారు.