BRS MLC Kavitha in Bodhan: తెలంగాణ ఎన్నికల నామినేషన్లకు (Telangana Elections 2023) శుక్రవారంతో గడువు ముగియనుంది. దీంతో అభ్యర్థులు గురువారం పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన్ల దాఖలులో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు కొందరు రోడ్‌​షోలు నిర్వహించి.. తమ నామినేషన్లు వేస్తున్నారు. మరికొందరు బ్యాండ్‌​తో ప్రచారం చేస్తూ నామినేషన్​ దాఖలు చేస్తున్నారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి తమ అనుచరులతో నామినేషన్ పత్రాలు పంపిస్తున్నారు. కొందరు నేతలు పూజలు నిర్వహించి.. శుభ ఘడియలు చూసుకుని ముఖ్యనేతలను తమ వెంట తీసుకు వెళ్లి నామినేష్లు వేస్తున్నారు. 


ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సైతం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆమె పోటీ చేయడానికి కాదు. తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. వివరాలు.. బోధన్​ బీఆర్​ఎస్ అభ్యర్థిగా షకీల్​ (Shakil Aamir) గరువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కవిత పాల్గొన్నారు. షకీల్ నామినేషన్ వేసే క్రమంలో భారీ ర్యాలీ కారణంగా భారీ ట్రాఫిక్ ఏర్పడింది. 


దీంతో తన ఎమ్మెల్సీ కవిత తన కారును వదిలి స్కూటీపై ప్రయాణించి ప్రచార వాహనం దగ్గరకు చేరుకున్నారు. నామినేషన్ అనంతరం కవిత మాట్లాడారు. బోధన్​ నామినేషన్ ముందు నిర్వహించిన​ భారీ ర్యాలీ విజయయాత్రతో తప్పక గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్ ముచ్చటగా​ మూడోసారి అధికారం చేపడుతుందని అన్నారు. కారు గుర్తుకు అందరూ ఓటు వేయాలని ప్రజలను కోరారు.






కవిత తీరుపై విమర్శలు
షకీల్ నామినేషన్ సందర్భంగా కవిత కొద్ది రూరం స్కూటీపై ప్రయాణించారు. ఈ  వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. కవిత స్కూటీపై వెళ్తున్న సమయంలో ఆమె సెక్కూరిటీ గార్డ్స్‌తో పాటు అనుచరులు పరిగెత్తుకుంటూ ఆమె స్కూటీని అనుసరిస్తూ వచ్చారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఎమ్మెల్సీ కవిత తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. సెక్యూరిటీ టీమ్ ఏం తప్పుచేసిందని పరిగెత్తిస్తున్నారని విమర్శించారు.  


నామినేషన్లు వేసిన సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM Kcr) గజ్వేల్, కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం గజ్వేల్ (Gazwel), మధ్యాహ్నం కామారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. గజ్వేల్ లోని సమీకృత భవనంలో రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ కామారెడ్డి చేరుకున్న ఆయన, బీఆర్ఎస్ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ గంప గోవర్థన్, సోమ భరత్ ఉన్నారు. 


మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నామినేషన్
మరోవైపు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సైతం నామినేషన్లు వేశారు. తొలుత సీఎం కేసీఆర్, తల్లి శోభ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్ సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. సిద్ధిపేటలోని ఆర్డీవో కార్యాలయంలో మంత్రి హరీష్ రావు సైతం నామినేషన్ దాఖలు చేశారు. అగ్రనేతల నామినేషన్లతో ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల సందడి నెలకొంది.