MLC Kavitha: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి పార్టీ)గా మారిన తరువాత దేశ వ్యాప్తంగా ఈ పార్టీపై, సీఎం కేసీఆర్ పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్ లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దాంతో బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలని అడుగుతూ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ట్వీట్ చేశారు. సాగర్ వరదే చేసిన ఈ ట్వీట్ కు కవిత స్పందించారు.


దేశవ్యాప్తంగా జరిగే పబ్లిక్ మీటింగ్ లు, ప్రోగ్రామ్ లలో నేరుగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆ వ్యక్తికి సూచించారు. కాంటాక్ట్ వివరాలను నేరుగా పంపాలని, బీఆర్ఎస్ లో స్వాగతించేందుకు సంతోషిస్తున్నామని కవిత ట్వీట్ చేశారు. అలాగే రాబోయేది కిసాన్ సర్కార్ అని, బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. అయితే ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నాందేడ్ లో నిర్వహించిన బహిరంగ సమావేశం మహారాష్ట్ర ప్రజానీకంపై గణనీయమైన ప్రభావం చూపిందని కవిత వెల్లడించారు. 






మరోవైపు బీఆర్ఎస్ లో చేరేందుకు చాలా మంది ఇతర రాష్ట్రాల నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా సీనియర్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి గమాంగ్‌ ఫ్యామిలీతో కలిసి బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గిరిధ‌ర్‌కు సీఎం కేసీఆర్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. గిరిధ‌ర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, న‌లుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో హేమ గమాంగ్, జ‌య‌రాం పాంగీ, రామ‌చంద్ర హ‌న్ష్‌డా, బృందావ‌న్ మ‌జ్హీ, న‌బీన్ నంద‌, రాథా దాస్, భ‌గీర‌థి సేతి, మ‌య‌దార్ జేనా ఉన్నారు. గిరిధర్ గమాంగ్‌ను  బీఆర్ఎస్ ఒడిషా శాఖ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. 


ఇతర రాష్ట్రాల నాయకులు పెద్ద ఎత్తున మా పార్టీలో చేరుతారు..!


దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని కవిత తెలిపారు. రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాల నాయకులు చాలా మంది తమ పార్టీలో చేరుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు మహిళలను, బతుకమ్మను కూడా అహేళన చేస్తూ మాట్లాడన్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ.. మమతా బెనర్జీని, బండి సంజయ్ తన గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం బాధాకరం అన్నారు. ప్రజలంతా వీటిని చూస్తున్నారని.. సరైన సమయంలో వాళ్లే బీజేపీకి బుద్ధి చెబుతారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఏర్పాటు వల్ల బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందంటూ ఎద్దేవా చేశారు. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాబోతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.  బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేసి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా వ్యూహాలను రచిస్తామన్నారు.