ఇప్పటికే పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ, తాజాగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. స్థానిక సంస్థల కోటాలో వైసీపీకి పోటీయే లేదు కాబట్టి, ఇప్పుడు ప్రకటించిన పేర్లన్నీ దాదాపుగా ఎమ్మెల్సీలుగా ఖరారైనట్టే లెక్క. ఈ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన మేరుగ మురళిని ఎంపిక చేశారు. మొదటినుంచీ పార్టీకి విధేయుడిగా ఉంటూ వచ్చిన మేరుగ మురళికి ఇన్నాళ్లకు చట్ట సభల్లోకి ఎంట్రీ ఇప్పిస్తున్నారు సీఎం జగన్. మురళి అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఎవరీ మురళి..?
ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని రాపూరుకు చెందిన మేరుగ మురళి, మేకపాటి కుటుంబానికి నమ్మిన బంటు. వైసీపీ ఆవిర్భావం తర్వాత మేకపాటి కుటుంబంతో పాటు, మురళి కూడా వైసీపీలోకి వచ్చేశారు. ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. గూడూరు ఎస్సీ రిజర్వ్ డ్ సీటు కావడంతో అక్కడినుంచి ఆయన పోటీ చేయాలని భావించారు. కానీ 2014లో ఆ అవకాశం పాశిం సునీల్ కి ఇచ్చారు జగన్. ఆయన నమ్మకాన్ని నిలబెట్టిన సునీల్ గూడూరు నుంచి వైసీపీ ఎమ్మల్యేగా గెలిచారు. కానీ గెలిచిన ఏడాదిలోనే ఆయన పార్టీ ఫిరాయించారు. టీడీపీలో చేరారు. ఆ తర్వాత అక్కడ నియోజకవర్గ కన్వీనర్ గా మేరుగ మురళిని నియమించారు జగన్.
మేరుగ మురళి గూడూరు నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ గా బాధ్యతలు తీసుకుని 2019 ఎన్నికల వరకు అక్కడ పార్టీ కేడర్ ను ముందుకు నడిపించారు. 2019 ఎన్నికల్లో గూడూరు నుండి పోటీ చేయడం ఖాయం అనుకున్న దశలో, అనూహ్యంగా ఆయన వెనక్కు తగ్గారు. అప్పటి వరకు తిరుపతి ఎంపీగా ఉన్న వరప్రసాద్ కి గూడూరు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చారు. వరప్రసాద్ గెలిచినా కూడా పార్టీ వ్యవహారాల్లో ఆయన అంత చురుగ్గా లేరు.
ఇక మేరుగ మురళికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మైన్ గా అవకాశమిచ్చారు సీఎం జగన్. అయితే ఆ పదవితో ఆయన సంతృప్తిగా లేరనే విషయం రోజుల వ్యవధిలోనే తేలిపోయింది. నామినేటెడ్ పోస్ట్ కంటే చట్టసభలకు వెళ్లి రాణించాలని భావించారు మురళి. సీఎం జగన్ నెల్లూరు పర్యటనల్లో కూడా పదే పదే ఈ విషయాన్ని ఆయనకు గుర్తు చేశారు. దీంతో ఇన్నాళ్లకు మేరుగ మురళికి ఛాన్స్ దక్కింది. ఆయన్ను శాసన మండలికి పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు జగన్.
నెల్లూరు జిల్లా స్థానికి సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మేరుగ మురళి పేరు అధిష్టానం ప్రకటించింది. పోటీ లేదు కాబట్టి ఆయన దాదాపుగా ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టే లెక్క. ప్రస్తుతం నెల్లూరునుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వాకాటి నారాయణ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు నెల్లూరు జిల్లానుంచి మేరుగ మురళి ఆ స్థానంలోకి వెళ్తారు. ఈనెల 22న మురళి నామినేషన్ దాఖలు చేస్తారు. ఈనెల 23వ తేదీ వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 13న పోలింగ్, మార్చి 16న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల ఉంటాయి.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వైసీపి నెల్లూరు జిల్లాకే చెందిన పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డిని ప్రకటించింది. ఉపాధ్యాయ నియోజకవర్గ వైసీపి అభ్యర్ధిగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లానుంచి మరో ఎమ్మల్సీ అభ్యర్థి పేరు ఖరారైంది. పట్టభద్రుల, టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి, స్థానిక సంస్థల విషయంలో మాత్రం పోటీ ఉన్నా కూడా అభ్యర్థిక ఎన్నిక లాంఛనమే.