నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఓ విద్యార్థి రైలు కిందపడి చనిపోయిన ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట దీన్ని ఓ ప్రమాదం అనుకున్నారు రైల్వే పోలీసులు. ఉదయం వాకింగ్ కి వచ్చిన విద్యార్థి రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని చనిపోయాడని అనుకున్నారు. ఆ విధంగా దర్యాప్తు ప్రారంభించారు. కానీ తల్లిదండ్రులు అది ఆత్మహత్య అంటున్నారు. ర్యాగింగ్‌కి బలైపోయాడని ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ టి.పెంచలయ్య, లక్ష్మి కుమారి దంపతుల కుమారుడు ప్రదీప్. ప్రదీప్ కావలిలోని RSR ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుపున్నాడు. సెకండ్ ఇయర్ కి వచ్చినా ర్యాగింగ్ భూతం అతడిని వెంటాడింది. ఫస్ట్ ఇయర్ లో ఎలాగోలా నెట్టుకొచ్చినా, సెకండ్ ఇయర్ లో ర్యాగింగ్ భరించలేకపోయేవాడినని తల్లిదండ్రులకు చెబుతుండేవాడు ప్రదీప్.
ఎమ్మెల్యేకు చెందిన కాలేజ్..
బోగోలు మండలం కడనూతలలోని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీ RSR ఇంజినీరింగ్ కాలేజీ. ఈ కాలేజీ ఇప్పుడు వార్తల్లోకెక్కడంతో రాజకీయంగా కూడా ఇదో సంచలన విషయంగా మారింది. ఎమ్మల్యేకి చెందిన కాలేజీలో కూడా ర్యాగింగ్ జరుగుతోందని, ఆ ర్యాగింగ్ వల్లే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.
ర్యాగింగ్ ఎలా చేసేవారంటే..?
అమ్మాయిల ఫోన్ నెంబర్లు కావాలంటూ ప్రదీప్ ని ర్యాగింగ్ చేసేవారట సీనియర్లు. వారి క్లాస్ మేట్స్ అమ్మాయిల ఫోన్ నెంబర్లు కావాలని ప్రదీప్ ని వేధించేవారట. బీర్లు, బిర్యానీ కొనిపెట్టాలంటూ ఒత్తిడి చేసేవారట. ఆటో డ్రైవర్ కొడుకు కావడం, మధ్యతరగతి కుటుంబం కావడంతో డబ్బులు ఇవ్వలేక, వారు పెట్టే టార్చర్ భరించలేక చాలాసార్లు ప్రదీప్ కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాడని అంటున్నారు. డబ్బులు లేవని చెబితే సెల్ ఫోన్ లాక్కునేవారని చెప్పేవాడట ప్రదీప్.
కాలేజీలో ఫిర్యాదు చేశారా..?
ర్యాగింగ్ విషయం కాలేజీలో ఫిర్యాదు చేస్తామంటే ప్రదీప్ భయపడేవాడని చెబుతున్నారు తల్లిదండ్రులు. అందుకే తాము మొదట్లో వెనకడుగు వేశామని, ఆ తర్వాత ధైర్యంగా కాలేజీల ఫిర్యాదు చేశామని, టీసీ ఇచ్చేయమని అడిగామని, కానీ యాజమాన్యం పట్టించుకోలేదని చెబుతున్నారు ప్రదీప్ పేరెంట్స్. దీంతో వారు కూడా సైలెంట్ గా ఉండిపోయారు. వారం రోజులనుంచి ర్యాగింగ్ మరీ ఎక్కువైందని ఇంట్లో చెప్పేవాడట ప్రదీప్. వారి పేర్లు చెప్పాలని అడిగితే మాత్రం సైలెంట్ గా ఉండేవాడట.
హాస్టల్ వదిలి వెళ్లిపోతే చంపేస్తామని కూడా బెదిరించారట. దీంతో హాస్టల్ వదిలి రాలేక, యాజమాన్యానికి వారెవరో చెప్పలేక ప్రదీప్ సతమతం అయిపోయాడట. ఆ తర్వాత శివరాత్రికి సెలవలు రావడంతో ప్రదీప్, కావలి కలుగోళమ్మ పేటలో ఉన్న చిన్నమ్మ ఇంటికి వెళ్లాడని చెబుతున్నారు తల్లిదండ్రులు. అక్కడే ఉండి తిరిగి కాలేజీకి వెళ్తాడని భావించామని, ఇలా ప్రాణాలు తీసుకుంటాడని అనుకోలేదన్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు పేరెంట్స్.
ప్రమాదంగా ఈ కేసు రిజిస్టర్ చేశామని, ఆత్మహత్య అని చెబుతున్నందున దీన్ని బిట్రగుంట స్టేషన్ కు బదిలీ చేస్తామంటున్నారు రైల్వే పోలీసులు. ప్రదీప్ తల్లిదండ్రులు మాత్రం చేతికి ఎదిగొచ్చిన కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదని భోరున విలపిస్తున్నారు.