MLC Kavitha: బీఆర్ఎస్ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ తిరష్కరించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గవర్నర్ తీరు బాధాకరం అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరష్కరించడం విచారమైన పరిణామం అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ నిర్ణయం వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం అని గవర్నర్ మరో సారి నిరూపించారని అన్నారు. గవర్నర్ హోదాను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రెకమెండేషన్ల జాబితాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉండాలని, కానీ రాజ్యాంగ పరమైన పదవుల్లో ఉన్నవారు ఇతరత్రా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం అన్నారు. దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తుందా అంటూ ప్రశ్నించారు. పలు రాష్ట్రాల్లో గవర్నలు బీజేపీ అధిష్టానం చెప్పినట్లే నడుచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి రాజ్యాంగ సంస్థకు హద్దులు, హక్కులు ఉంటాయని, వాటిని పక్కన పెట్టి గవర్నర్లు ఇలా చేయడం నిజంగా దురదృష్టకరం అన్నారు.
చాకలి ఐలమ్మ జయంతిని అసెంబ్లీ, మండలిలో జరుపుకుంటున్నామని చెప్పారు. బీసీ, అణగారిన వర్గాలకు బీఆర్ఎస్ పెద్ద పీట వేస్తోందని, అయితే బీజీపీ ఆయా వర్గాలను బలోపేతం చేయడానికి వ్యతిరేకంగా పనిచేయడం బాధాకరమని అన్నారు. ప్రజలు ఈవిషయాన్ని ఇప్పటికైనా గమనించాలని కోరారు. గవర్నలు సైతం రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వారే ఉంటారని, వాటిపై తాను మాట్లాడాలని అనుకోవడం లేదన్నారు. గవర్నర్ సాంప్రదాయాలను పాటించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను ఆమోదించడం గవర్నర్ సాంప్రదాయం అన్నారు. దానిని కాపాడకుండా, దానిని కూడా ఒక వివాదాస్పదంగా మార్చాలనుకోవడం దారుణమన్నారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు రాజకీయంగా మంచి అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ తిరష్కరించారని అన్నారు. భారతీయ జనతా పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని మరోసారి నిరూపితమైందన్నారు. చట్ట సభల్లో చాలా తక్కువ ప్రధాన్యం ఉన్న బీసీ వర్గాలకు చెందిన వారి పేర్లను తిరష్కరించడం ద్వారా ఆయా సామాజిక వర్గాలను రాజ్యాంగ వ్యవస్థలకు దూరం చేస్తున్నారని ఆరోపించారు.
వారికి మాత్రమే ఆమోదం
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన వారి జాబితాను తమిళిసై తిరస్కరించారు. ఈ గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసి గవర్నర్ దగ్గరికి తెలంగాణ ప్రభుత్వం జాబితా పంపించింది. కొంత కాలంగా దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లోనే ఉంచిన గవర్నర్ తాజాగా, నేడు తిరస్కరిస్తూ ప్రభుత్వానికి సమాచారం పంపించారు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేయలేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
రాజకీయాలకు చెందిన వారిని ప్రతిపాదిస్తే తిరస్కరిస్తానని గవర్నర్ తేల్చి చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని వారి పేర్లు పంపాలని సూచించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని గవర్నర్ చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల్లో వీరిద్దరి పాత్ర గురించి ప్రస్తావించలేదని గవర్నర్ అన్నారు. ఈ విషయంపై లేఖను కూడా పంపారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల అభ్యర్థిత్వాలను ఏ ఏ కారణాలతో రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో వేర్వేరు లేఖల్లో గవర్నర్ వివరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లేఖలు పంపారు.