ఢిల్లీ మద్యం విధానంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను ఢిల్లీ బీజేపీ నేతలపై పరువు నష్ట దావా వేయనున్నాట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కూడా కోర్టును అశ్రయించబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరిపారు. 


నిరాధారంగా మాట్లాడడం ఆరోగ్యకర పద్ధతి కాదు..


దిల్లీ లిక్కర్ స్కాంకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కావాలనే బీజేపీ నాయకులు బట్ట కాల్చి తమపై వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కక్ష్యపూరిత రాజకీయాలు చేసే కాషాయ దళం ఏది పడితే అది మాట్లాడుదోందని వివరించారు. సీఎం కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే... కేసీఆర్ ఆగం అయి వెనక్కి తగ్గుతారని బీజేపీ నాయకులు అనుకుంటున్నట్లు కవిత స్పష్టం చేశారు. కానీ అలాంటి వాటికి తాము అస్సలే భయపడం అని.. ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసిన అన్నీ వ్యర్థమేనని వ్యాఖ్యానించారు.


నిరాధారంగా మాట్లాడటం ఆరోగ్యకరమైన పద్దతి కాదని హితవు పలికారు. తెలంగాణ కోసం ఉద్యమించిన అన్ని సంవత్సరాలలో, తమ కుటుంబ సభ్యుల మీద అనేక ఆరోపణలు చేసినా, మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడ్డామన్నారు కవిత. భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే కలతో, ఎజెండాతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని కవిత తెలిపారు. బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగా లేదని మండి పడ్డారు. దీన్ని ప్రజలంతా గమనించాలని అన్నారు కవిత.


అసలేమైందంటే...?


ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసింది. దిల్లీ ప్రభుత్వంలో కీ రోల్‌ పోషించే మనీష్‌ సిసోడియా ఇంట్లో సోదాలు కూడా జరిపింది. ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లోను షేక్ చేస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నేతలు ఇందులో భాగమై ఉన్నారంటూ బీజేపీ సంచలన ఆరోపణలు చేస్తోంది. 


కవితనే డీల్ కుదిర్చారంటూ కామెంట్లు..!


ఢిల్లీ మద్య పాలసీ రూపకల్పన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే జరిగిందని బీజేపీ నేతలు పర్వేశ్ సాహిబ్ సింగ్, మంజీందర్‌ సింగ్‌ సిర్సా బాంబు పేల్చారు. కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా ప్రస్తావిస్తూ సిర్సా తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో అమలువుతున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన డీల్ ను సెట్ చేసింది కల్వకుంట్ల కవిత అంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్స్ వేదికగా డీల్ జరిగిందన్నారు. తెలంగాణ కేసీఆర్ తరపున ఎమ్మెల్సీ కవిత.. లిక్కర్ మాఫియాకు, ఢిల్లీ గవర్నమెంట్ కు మధ్య డీల్ కుదిర్చారని తెలిపారు. ఇందుకోసం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు 150 కోట్ల రూపాయల ముడుపులు కూడా అందాయంటూ పొలిటికల్ హీట్ రాజేశారు మాంజీందర్ సింగ్ సిర్సా.


ఒబెరాయ్ హోటల్‌లో సూట్‌ను తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన వ్యక్తి ఆర్నెళ్ల కోసం బుక్ చేశాడని ఆరోపించారు సిర్సా. డీల్ జరిగినన్ని రోజులు కేసీఆర్ కుటుంబ సభ్యులు స్పెషల్ ఫ్లైట్‌లోనే ఢిల్లీ హైదరాబాద్‌ మధ్య తిరిగేవారన్నారు. ఈ ఫ్లైట్‌ను తెలంగాణ మద్యం మాఫియా ఏర్పాటు చేసిందంటూ వివరించారు