MLC Kavitha  :  మహిళా రిజర్వేషన్ల కోసం తాను ఉద్యమం ఆపేది లేదని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్లలో ఆరు శాతం కూడా మహిళలకు కేటాయించకపోవడంపై వస్తున్న విమర్శలపై కవిత ఘాటుగా స్పందించారు. మహిళా రిజర్వేషన్లు తన  వ్యక్తిగత ఎజెండా కాదని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని తెలిపారు. మహిళల రిజర్వేషన్ల కోసం అంబేడ్కర్‌ కూడా  పోరాడారని చెప్పారు.                    


 ప్రస్తుతం పార్లమెంటులో మహిళలు కేవలం 12 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. తొలి లోక్‌సభలో 8 శాతం మహిళా ఎంపీలే ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 12 శాతానికి మాత్రమే చేరిందని అన్నారు. మణిపూర్‌లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మహిళలు మిగిలిపోవాలా? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.                          


కిషన్‌రెడ్డి, బీజేపీ నాయకులు అనవసరంగా తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2010 రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. 2023 వచ్చినా ఎందుకు ఆమోదం పొందడం లేదని ప్రశ్నించారు. 14 ఏండ్లుగా మోదీ సర్కార్‌ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం వచ్చే డిసెంబర్‌లో మరోసారి దీక్ష చేస్తామని ఆమె ప్రకటించారు. ఈ దీక్షకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతి ఇరానీ సహా మహిళా నేతలు అందర్నీ ఆహ్వానిస్తామని తెలిపారు.                                      


గత మార్చ్‌లో  మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని జంతర్ మంతర్ వద్ద కవిత ధర్నా చేసారు.  27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాటం చేస్తున్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లుకు మాత్రం ఆమోదం రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగిస్తామని  ... చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలనేది తమ  డిమాండ్ అనిచెబుతున్నారు.  2014, 2018 ఎన్నికల్లోనూ బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చింది. 300కు పైగా ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చినా బిల్లు ఆమోదించలేదని విమర్శిస్తున్నారు. 


ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగినట్లు ఓ ప్రొఫెసర్‌ ఆరోపించారని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత.. దీన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే వెళ్తుందని ఓ ఎంపీ అనడం దారుణమని పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా చర్యలు తప్పవని బీఆర్‌ఎస్‌ నాయకులను ఆమె హెచ్చరించారు. ప్రజాజీవితంలో ఉన్న ఎవరైనా సరే మర్యాదగా మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యే టికెట్‌ రాని అందరికీ తగిన ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు భయమన్నది లేదని తెలిపారు.