వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీచేయాలన్న నిర్ణయం రాజకీయ చర్చకు దారి తీసింది. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో మొదటిసారి రెండు  అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు కేసీఆర్‌. గజ్వేల్, కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్‌లో ఓడిపోతారన్న భయంతోనే కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీకి  దిగుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ, కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ వెనుక పెద్ద పొలిటికల్‌ స్కెచ్‌ ఉందంటూ చెబుతున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఎన్నికల తర్వాత అదేంటో విపక్షాలకు తెలుస్తుందని చెప్పుకుంటున్నారు. కూతురు కవిత కోసమే కేసీఆర్‌ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. 


గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కవిత. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా.. కేసీఆర్ కుమార్తె ఓడిపోవడం అపట్లో చాలా పెద్ద చర్చకు దారి తీసింది. అప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యి బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. అయినప్పటికీ కవిత ఓటమిని బీఆర్‌ఎస్‌ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. ఆ తర్వాత ఆమెను ఎమ్మెల్సీని చేశారు. కానీ, సీఎం కూతురి ఓటమిపై ప్రతిపక్షాలు ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించాయి. సోషల్‌మీడియాలో కూడా ట్రోలింగ్‌ చేశారు. గత ఎన్నికల్లో కవిత పరాజయం... బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓ బ్లాక్‌ మార్క్‌లా ఉండిపోయింది. ఈసారి అలా కాకూడదే కేసీఆర్‌  ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ స్కేచ్ వేశారని చెబుతున్నారు. 


ఈసారి కూడా కవిత నిజామాబాద్ నుంచే బరిలోకి దిగుతురాని తెలుస్తోంది. అక్కడి సిట్టింగ్‌ ఎంపీ, బీజేపీ నేత అర్వింద్‌... కవితపై పోటీకి సై అంటే సై అంటున్నారు. దీంతో  నిజామాబాద్‌లో ఆమె గెలుపు అంత ఈజీ కాకపోవచ్చని అంటున్నారు. మరి ఈసారి కూడా కవిత ఓడిపోతే? అది కేసీఆర్‌కు అప్రతిష్టగా మారుతుంది. అలా జరగకూడదని కవితను ఎలాగైనా గెలిపించాలని కేసీఆర్‌ విశ్వప్రయత్నం చేస్తున్నారు. కూతురి కోసమే కేసీఆర్‌ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నట్టు టాక్‌ నడుస్తోంది. కేసీఆర్‌ కామారెడ్డి  నుంచి బరిలో ఉంటే... ఉమ్మడి నిజాబామాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ప్రభావం ఉంటుంది. అది నిజమాబాద్‌లో కవిత గెలుపునకు కూడా ఉపయోగపడుతుందని కేసీఆర్‌  లెక్క. గతంలోనూ ఓసారి కరీంనగర్, ఇంకోసారి పాలమూరు ఎంపీగా కేసీఆర్ పోటీ చేసి గెలిచారు. ఆయన పోటీతో అప్పటివరకూ మహబూబ్‌నగర్‌లో అంతగా బలంగా లేని పార్టీలో ఊపొచ్చింది. ఆదే స్ట్రాటజీని ఇప్పుడు కామారెడ్డి కేంద్రంగా నిజామాబాద్‌పై కేసీఆర్‌ ప్రయోగిస్తున్నారని అంటున్నారు. 


ఇదోక వాదన అయితే. మరో వాదన కూడా వినిపిస్తోంది. కేసీఆర్‌ రెండు స్థానాల్లో విజయం సాధిస్తే.. ఓ చోట రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పడు అక్కడ ఉపఎన్నిక వస్తుంది. కావాలనుకుంటే ఎమ్మెల్సీగా కవితతో రాజీనామా చేయించి గజ్వేల్‌ నుంచి పోటీ చేయించ వచ్చనే ఆలోచన కూడా చేస్తున్నారేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో ఆమెను అసెంబ్లీకి పంపించడం సులభం అవుతుందని టాక్. ఇప్పుడే నేరుగా పోటీ చేస్తే కవితను టార్గెట్‌ చేసుకొని ప్రతిపక్షాలు ఏకమై పైచేయి సాధించవచ్చని అంటున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు స్థానాల్లో ఎక్కడైనా పోటీ చేస్తే ఈజీగా గెలవ వచ్చని అంటున్నారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial