American Telugu Association Telangana Pavilion Inaguration: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో తొలిసారిగా తెలంగాణ పెవిలియన్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఆటా 17 వ మహా సభల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించారు. అనంతరం రచయిత ప్రభావతి రాసిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.


తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అమెరికాలో ఉన్న తెలుగు వారికి తెలియజేసేందుకు, ఆటా మహాసభల్లో తెలంగాణ పెవిలియన్ ను ఏర్పాటు చేయడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ పెవిలియన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు స్పూర్తిదాయకంగా నిలవడంతో పాటు, భవిష్యత్ తరాలకు తెలియజేయవచ్చని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రతి మహాసభలో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేయాలని ఆటా ప్రతినిధులను ఎమ్మెల్సీ కవిత కోరారు.


ఆటా అంటే ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్ గా ఎమ్మెల్సీ కవిత అభివర్ణించారు. ఒకప్పుడు భారతదేశంలో తెలుగువారికి ఎన్టీ రామారావు గుర్తింపు తెచ్చారన్న ఆమె,  తెలంగాణ వారికి భారతదేశంలో కేసీఆర్ గారు గుర్తింపు తెచ్చారని అన్నారు. అదే విధంగా అమెరికాలో తెలుగువారికి ఆటా గుర్తింపు తెచ్చిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మహాసభల ద్వారా తెలుగు సంస్కృతిని ముందు తరాలకు తెలియజెప్పేందుకు ఆటా ప్రతినిధులు చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. భారతదేశం గర్వించే  స్థితికి అమెరికాలోని తెలుగువారు ఎదిగారని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. అమెరికాలోని తెలుగు అసోసియేషన్ లు తానా, ఆటాలకు ఎదైనా నగరంలో హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేసి, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మ్యూజియం లాంటిది ఏర్పాటు చేస్తే భవిష్యత్తు తరాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత సూచించారు. 




మాల్దీవులు, మారిషస్ లో ఉన్న తెలుగు వారంతా, తెలుగు భాషను, సంస్కృతిని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను అమెరికాలోని తెలుగు ప్రజల భవిష్యత్ తరాలకు అందించేందకు గాను, ఆటాకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఆటా వ్యవస్థాపక సభ్యుడు హన్మంత రెడ్డి, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధులు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.