Mlc Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారిన పడ్డారు. ఆమెకు ఇవాళ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే కల్వకుంట్ల కవిత గత మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్నారు. అయితే దగ్గు ఎంతకీ తగ్గక పోవడం, మిగతా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో ఆమె వైద్యులను సంప్రదించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కవితకు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. దాంతో పాటు కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. 






ఐసోలేషన్ లోకి కవిత


కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కూడా కొవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ శుచి శుభ్రత పాటించాలని, తరచూ చేతులకు కడుక్కోవాలని, ఇతరులతో భౌతిక దూరం పాటించాలని, ఇంటి నుండి బయటకు వెళ్తే తప్పకుండా మాస్కులు ధరించాలని కవిత సూచించారు. కరోనా నిర్ధారణ అయిన వాళ్లు ఇతరులకు దూరంగా ఐసోలేషన్ లో ఉండాలని కోరారు. తాను వైద్యులు సూచించినన్ని రోజులు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. 


ఇటీవలె మంత్రి కేటీఆర్ కు కరోనా


అయితే ఇటీవలె మంత్రి కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆగస్టు 30వ తేదీన తనకు కరోనా సోకిందని, పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వల్ప లక్షణాలతో కనిపిస్తుండటంతో ఆయన పరీక్ష చేయించుకున్నారు. రిపోర్టుల్లో పాజిటివ్ అని రావడంతో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. కేటీఆర్ కు కరోనా రావడం ఇది రెండో సారి. గత ఏడాది కూడా కేటీఆర్ కరోనా బారిన పడ్డారు.  అప్పుడు కూడా స్వల్ప లక్షణాలు రావడంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రెండ్రోజుల చికిత్స తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు కూడా స్వల్ప లక్షణాల వల్లే కరోనా పరీక్ష చేయించుకున్నారు. లక్షణాలు స్వల్పంగానే ఉండటంతో వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉన్నారు. కేటీఆర్ ప్రికాషన్ డోస్ కూడా తీసుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా సోకుతుంది. కానీ స్వల్ప లక్షణాలతో వారు బయట పడిపోతున్నారు. 


కేటీఆర్ ఇటీవలె ఇంట్లో ప్రమాదానికి గురయ్యారు. కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో మూడు వారాల పాటు బెడ్ కే పరిమితం అయ్యారు. ఇటీవలే ఆయన కోలుకున్నారు. వైద్యుల పర్యవేక్షణలో నడవగలిగారు. పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ సభల్లో చురుగ్గా పాల్గొన్నారు. దాని నుండి కోలుకున్న తర్వాత ఇప్పుడు కరోనా రావడంతో మరోసారి ఆయన ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. గతంలో కరోనా సోకిన వారు రెండు వారాల పాటు ఐసోలేషన్ లో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం నాలుగైదు రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే ఐసోలేషన్ పూర్తి కానుంది.