Rajasingh :  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తెలంగాణ నూతన సచివాలయంలోకి  వెళ్లేందుకు అనుమతి లభించలేదు. గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయనకు అధికారికంగా ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్ిచంది. అయితే   సచివాలయంలోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా ఆహ్వానం పంపారు. ఇదే విషయాన్ని మంత్రి పేషీ కూడా చెబుతుతోంది.   కానీ బుల్లెట్‌పై సెక్రటేరియట్‌కు వచ్చిన రాజాసింగ్‌ను.. భద్రతా సిబ్బంది అడ్డగించారు. కొద్ది సేపు గేటు వద్ద ఎదురు చూసినా ప్రయోజనం లేకపోవడంతో వెళ్లిపోయారు.         


 





             


మీటింగ్‌ అని చెప్పి తనను ఆహ్వానించి, లోపలికి అనుమతించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యేలు కూడా సచివాలయంలోనికి రాకూడదా అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం పంపితేనే తాను ఇక్కడకు వచ్చానన్నారు. లోపలికి అనుమతి లేకుంటే ఆహ్వానం ఎందుకు పంపారని నిలదీశారు. టైమ్ పాస్ కోసం మీటింగ్ పెట్టారా ? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్ లోపలికి రాకూడదా అని ప్రశ్నించారు.   ఎమ్మెల్యేలకే సచివాలయంలోకి అనుమతి లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని రాజాసింగ్ ప్రశ్నించారు.  ప్రజల డబ్బుతో కట్టిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులను అనుమతించకపోవటం సిగ్గుచేటన్నారు.  అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.                       
 
తనను గేటు వద్దే ఆపేయటం బాధ కలిగించిందన్నారు. మంత్రి తలసాని పిలిచి అవమానించారని అన్నారు. మంత్రి పేషీ వాదన మాత్రం మరోలా ఉంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. అయితే రాజాసింగ్ మాత్రం గేటు వరకు వచ్చి తిరిగి వెళ్లిపోయారని మంత్రి పేషీ అధికారులు వెల్లడించారు. తాను వెళ్లిపోలేదని లోపలికి అనుమతించలేదని రాజాసింగ్ మండిపడ్డారు.                           


తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభానికి కూడా ఇతర పార్టీల వారెవరూ రాలేదు. గవర్నర్ కు కూడా ఆహ్వానం పలకకపోవడం వివాదాస్పదమయింది. మరో వైపు  సీఎస్ ను కలిసి.. ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై ఫిర్యాదు చేసేందుకు సెక్రటేరియట్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా దారి మధ్యలోనే నిలిపివేశారు. ఇతర పార్టీల నేతలను సచివాలయంలోకి అనుమతించడం లేదని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.