Rohit Reddy Meets KCR : తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి...ట్రాప్ చేసి బీజేపీని ఇరుకున పెట్టిన పైలట్ రోహిత్ రెడ్డికి రెండు రోజుల కిందట ఈడీ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. తనకు వచ్చిన ఈడీ నోటీసుల విషయాన్ని రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కూడా రోహిత్ రెడ్డికి ఇచ్చిన ఈడీ నోటీసులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన శనివారం పైలట్ రోహిత్ రెడ్డికి సమయం ఇచ్చారు. ప్రగతి భవన్ నుంచే ఆ నోటీసుల విషయంలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈడీ ఎదుట హాజరు కావాలా.. చట్టవిరుద్ధంగా నోటీసులు ఉన్నాయన్న కారణంగా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలా అన్న అంశంపై ప్రస్తుతం రోహిత్ రెడ్డి.. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
తడి బట్టలతో ప్రమాణానికి బండి సంజయ్ రావాలని రోహిత్ రెడ్డి సవాల్
పైలట్ రోహిత్ రెడ్డి అంతకు ముందు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని.. తనపై ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ పై మండిపడ్డారు. బండి సంజయ్ తడి బట్టలతో రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు రావాలని సవాల్ చేశారు. తనకు డ్రగ్స్ కేసులో నొటీసులు వచ్చినట్లు నిరూపించాలన్నారు. బండి సంజయ్ కు తంబాకు వల్ల నోరు తిరుగతలేదని.. మాకు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపికి ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. బీజేపీ కి అబద్దాలు చెప్పడం కామన్ గా మారిందని విమర్శించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందన్నారు.
కర్ణాటక డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి నోటీసులూ రాలేదన్న రోహిత్ రెడ్డి
కర్ణాటక డ్రగ్స్ కేసులోనూ పైలట్ రోహిత్ రెడ్డి పేరు ఉందని.. అప్పట్లోనే ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని పైలట్ రోహిత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తనకు కర్ణాటక పోలీసుల నుంచి నోటీసులు వస్తే అమ్మవారి సాక్షిగా బీజేపీ చూపించాలన్నారు. అయ్యప్ప దీక్ష వేసుకొని నేను ప్రమాణం చేస్తున్నానని.. తనకు కర్ణాటక నుంచి ఎటువంటి నోటీసు రాలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుల్లో ఎఫ్ఐఆర్ లో ఎక్కడా తన పేరు లేదని పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. బండి సంజయ్ నిజంగా హిందు వాది అయితే రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు ఆదారలతో రావాలని సవాల్ చేశారు.
బయోడేటా కోసమే ఈడీ నోటీసులు ఇచ్చిందన్న ఎమ్మెల్యే
సోమవారం ఈడీ ఆఫీస్ కు రావాలని ఈడీ నోటీస్ ఇచ్చారని.. అయితే అందులో బయోడేటా కావాలని మాత్రమే అడిగారని రోహిత్ రెడ్డి చెబుతున్నారు. ఆదివారం బండి సంజయ్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు రాకపోతే మొన్నటి దొంగస్వాములకు ఆయనకూ తేడా ఉండదన్నారు. ఎమ్మెల్సీ కవిత సైతం నోటీసులు వస్తాయని బీజేపీ ముందే ఎలా చెప్పిందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో అందరూ కొట్లాడి.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సి ఉందని రోహిత్ రెడ్డి అంటున్నారు.