Telangana Congress :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తిరుగుబాటు  బావుటా ఎగురువేశారు. ఉత్తమ్ కుమర్ రెడ్డి దీనికి నేతృత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమైన సీనియర్లు రేవంత్ పేరు ఎత్తకుండానే  తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని రక్షించుకునేందుకే ఒరిజనల్ కాంగ్రెస్ నేతలంతా సమావేశమయ్యామని ఉత్తమ్ చెప్పారు.కొత్త కమిటీల్లో బయటి పార్టీ నుంచి వచ్చినవాళ్లే ఎక్కువగా ఉన్నారన్న ఉత్తమ్... కావాలనే సోషల్ మీడియాలో తమను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. తన వాళ్లే పదవుల్లో ఉండాలని తానెప్పుడూ భావించలేదన్నారు.  కమిటీల్లోని 108 మందిలో 58 మంది తెలుగుదేశం పార్టీవాళ్లే ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడా..? అని ప్రశ్నించారు. 


టీ పీసీసీ కమిటీల్లో సగం మందికిపైగా టీడీపీ వాళ్లే ఉన్నారన్న ఉత్తమ్


కమిటీల కూర్పుపై మరోసారి హైకమాండ్‌ను కలుస్తామని తెలిపారు. అసలైన కాంగ్రెస్‌నేతలను కోవర్టులని ప్రచారం చేస్తున్నారని, కొంతమంది కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని కాంగ్రెస్ నేత దామోదర్‌ రాజనర్సింహ అన్నారు.  వలస వచ్చిన నేతలకే కమిటీల్లో పదవులు ఇచ్చారని, సోషల్‌ మీడియాలో కోవర్టులని ప్రచారం చేస్తున్నారని దామోదర్‌ విమర్శించారు.కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీనియర్ నేత మధుయాష్కీ ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వాళ్లను వదిలి పెట్టబోమన్నారు.    


కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతోందని భట్టి విక్రమార్క ఆరోపణ


కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీని  కాపాడేందుకు సేవ్ కాంగ్రెస్ కార్యక్రమం చేపడతామన్నారు. పార్టీని నమ్ముకొని పని చేసిన వారికి కమిటీల్లో అవకాశం రాలేదని తెలిపారు. ఈ విషయంలో తాను కూడా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో సీనియర్ నేతలను కించపరిచేలా పోస్టులు పెడుతూ పార్టీని బలహీన పరుస్తున్నారని మండిపడ్డారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని కొందరు నేతలు తనతో చెప్పారని..   కమిటీల నియామకంలో తాను పాలుపంచుకోలేదని భట్టి చెప్పారు. కాంగ్రెస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తామని.. దేశవ్యాప్తంగా పార్టీని కాపాడుకుంటామని ప్రకటించారు. 


సీనియర్లందరి టార్గెట్ రేవంత్ రెడ్డేనా ?


రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అసంతృప్తిలో ఉన్నారు. ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. కమిటీలను ప్రకటించిన తర్వాత సీనియర్లలో అసంతృప్తి మరింత పెరిగిపోయింది.  ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారని..  మండిపడుతున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.  ఈ నేతల సమావేశంపై రేవంత్ రెడ్డి ఇంకా స్పందించలేదు.  మరో వైపు సీనియర్ల సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాలేదు కానీ..ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి.. ఏ నిర్ణయం తీసుకున్నా.. మీ వెంటే ఉంటానని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 


కరీంనగర్ బీఆర్ఎస్‌లో ఐక్యతారాగం - కలసిపోయిన మంత్రి గంగుల, సర్దార్ రవీందర్ సింగ్ !