MLA Danam Nagender fired on Hydra Commissioner Ranganath : హైదరాబాద్‌లో ఆక్రమణలపై కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ హైడ్రా విరుచుకుపడుతోంది. పెద్ద ఎత్తన ఆక్రమణను కూల్చేస్తున్నారు. ఇటీవల రాజేంద్రనగర్ లో మజ్లిస్ ఎమ్మెల్యేకు చెందిన ఇంటిని కూడా కూల్చేశారు. అలాగే నందగిరి హిల్స్‌లో ఆక్రమణలను కూడా తొలగించారు. అయితే ఇలా తొలగిస్తున్నప్పుడు అడ్డుపడటంతో దానం నాగేందర్‌పై కేసు నమోదయింది. దీనిపై దానం ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర హెచ్చరికలు చేశారు.
హైడ్రా కమిషనర్‌పై సీఎంకు ఫిర్యాదు చేస్తానన్న దానం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆ పోస్టులో పని చేయడం ఇష్టం లేనట్లుగా ఉందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే తాను బదిలీ చేయిస్తానన్నట్లుగా ఆయన మాట్లాడారు. రంగనాథ్‌పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. తనపై కేసు పెట్టారని.. అధికారులు వస్తూంటారు.. పోతూంటారని.. తాను లోకల్ అని హెచ్చరించారు. నందగిరి హిల్స్‌లో ఆక్రమణల పేరుతో తొలగింపులు చేస్తూంటే.. ఎమ్మెల్యేగా అక్కడుకు వెళ్లానన్నారు. తనను అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని.. ప్రజాప్రతినిధిగా ప్రజలకు కష్టం వస్తేనే వెళ్లానన్నారు. తనపై కేసు పెట్టిన వారికి ప్రివిలేజ్ నోటీసులు పంపిస్తానని దానం నాగేందర్ హెచ్చరించారు.
ప్రజాప్రతినిధిగా నందగిరి హిల్స్ వెళ్లే అధికారం ఉంది !
మూడు రోజుల కిందట హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో నందగిరి హిల్స్‌లో ఆక్రమణలు తొలగించారు. పార్కులు, ఫుట్ పాత్‌లు ఆక్రమించుకుని వ్యాపార సముదాయాలు నిర్మించారు. ఈ క్రమంలో అక్కడకు వెళ్లిన దానం నాగేందర్.. కూల్చివేతలు ఆపేయాలని అడ్డు పడ్డారు. పోలీసులపై దౌర్జన్యం చేశారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా హైడ్రా అధికారులు ఆక్రమణలు మొత్తాన్ని తొలగించేందుకు విస్తృృతంగా చర్యలు చేపడుతున్నారు.
బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్
దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. ఆయనపై అనర్హతా వేటు వేయిస్తామని బీఆర్ఎస్ పార్టీ న్యాయపోరాటం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం.. బీఆర్ఎస్ నేతపై దారుణమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు ఆయనకే గడ్డుపరిస్థితి ఎదురవుతోంది. ఆయనపై కేసులు నమోదవుతూండటంతో.. పార్టీ మారి ప్రయోజనం ఏమిటని ఆయన అనుచరులు అంటున్నారు.
హైదరాబాద్‌లో ఆక్రమణలపై సీరియస్‌గా రేవంత్
మరో వైపు హైడ్రా వ్యవస్థకు చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్‌కు అతి పెద్ద మైనస్ గా ఉన్న ఆక్రమణల తొలగింపును ఆయన సీరియస్ గా తీసుకున్నారు. సొంత పార్టీ నేతలు ఉన్నా కూడా వదిలి పెట్టబోమని చెబుతున్నారు. ఈ క్రమంలో దానం నాగేందర్ ఫిర్యాదు చేిసనా రేవంత్ పట్టంచుకునే అవకాశం లేదని భావిస్తున్నారు.