Minister Vemula: దేశ విదేశాల్లో ఈరోజు మహిళలు బతుకమ్మ సంబురాలు చేసుకోవడానికి ఎమ్మెల్సీ కవితే కారణం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్ కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ ప్రాముఖ్యం తగ్గుతున్న రోజుల్లో బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితదే అని మంత్రి వేముల అన్నారు. అందరూ సుఖ సంతోషాలతో బతుకమ్మ పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. చీరల పంపిణీ ప్రారంభించటానికి కారణం కవితే అన్నారు. అందరి మొహాల్లో చిరు నవ్వులు చూడాలని సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు కొన్ని విషయాలను గమనించి ఆలోచన చేయాలని, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్యపు ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు.
'మనవద్దే అత్యధిక మందికి పింఛన్లు'
గ్రామంలో పారిశుద్ధ్యం విషయంలో జరిగిన ప్రగతి.. కళ్ల ముందే ఉందని మంత్రి వేముల వివరించారు. ప్రతి ఇంటికి మంచి నీరు అందుతున్న విషయం వాస్తవమా కాదా అని అడిగారు. సీఎం కేసీఆర్ వచ్చాక గ్రామాల రుపు రేఖలే మారాయన్నారు. స్వచ్ఛ భారత్ గ్రామీణ విభాగంలో నిజామాబాద్ జిల్లాకు మూడో స్థానం దక్కిందని గుర్తు చేశారు. గత పాలకుల కాలంలో ఇలాంటి అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాక ముందు పెన్షన్ ల కోసం రూ.800 కోట్లు ఇచ్చేవారని.. రూ.22 లక్షల మందికి పింఛన్ లు వచ్చేవన్నారు. ఇపుడు పింఛన్ల కోసం సంవత్సరానికి ఇస్తున్నది 12 వేల కోట్లని, మొత్తం 42 లక్షల మందికి ఇస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ తెలిపారు. ప్రధాన మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా మన లాంటి పథకాలు అమలు కావటం లేదన్నారు. మరే ఇతర రాష్ట్రాల్లో లేనన్ని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి వీరిచే బీజేపీని మళ్లీ అధికారంలోకి రానిద్దమా అని ప్రశ్నించారు. పెట్రో, డీజిల్ ధరల పెరుగుదల వల్ల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని మంత్రి వేముల అన్నారు.
'బతుకమ్మను పట్టించుకున్న వారేరి?'
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... ప్రజలు జరుపుకునే పండగలను ప్రభుత్వం గుర్తిస్తే రాజ ముద్ర పడుతుందని తెలిపారు. గత పాలకుల కాలంలో సంక్రాంతికి ఇచ్చినంత ప్రాధాన్యత బతుకమ్మకు ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. కానీ మన ప్రభుత్వం గుర్తించి ఘనంగా జరుపుతున్నారని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు. వడ్డించే వాడు మనవాడయితే అదరికి కడుపు నిండినట్లుగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎంగా ఉన్నందున తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం.. మొక్కు బడి ప్రభుత్వం కాదని చెప్పారు. బతుకమ్మ చీర అంటే సీఎం కేసీఆర్ పుట్టింటి కానుకని, మీ అన్నగా, మీ పెద్ద కొడుకుగా పంపించే బహుమానం అన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరే ఇతర రాష్ట్రాల్లో అమలు కావటం లేదన్నారు. కేసీఆర్ కిట్ రూప కల్పన సీఎం ఎంతో పెద్ద మనసుతో చేసిన కార్యక్రమం అని అన్నారు. ఎవరికి యే కానుకను ఇచ్చినా తృప్తి చెందరు కానీ అన్నదానం చేస్తే తృప్తి ఉంటుందన్నారు.