Kuppam TDP Leaders : నెల రోజులుగా జైల్లో ఉన్న కుప్పం తెలుగుదేశం పార్టీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు నాయుడు, మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్, మునుస్వామి మరో నలుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25 వేల రూపాయల బాండ్‌తో ఇద్దరు పూచికత్తు సమర్పించాలని సూచించింది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్బంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల రోజులుగా టీడీపీ నేతలు చిత్తూరు జైలు లో ఉన్నారు. చిత్తూరు కోర్టు బెయిల్ తిరస్కరించడంతో టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పోసాని వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో ఏడుగురికి బెయిల్ మంజూరైంది.
చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తతల కారణంగా టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు
నెల రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్లారు.ఆ సమయంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు పోటీగా బ్యానర్లు కట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత అన్నక్యాంటీన్‌పై దాడి జరిగింది.. ఈ క్రమంలో టీడీపీ నేతలు కూడా ఎదురు దాడులు చేశారు. ఆ ఘటనల్లో రామకుప్పం లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు సహా 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు 143,147, 148, 149, 424 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మరో 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్త గణేష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లోనే టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు.
పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం
కుప్పం ఘర్షణలో కేవలం టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. పోలీసుల తీరును చంద్రబాబు తప్పుపట్టారు. డీజీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు చంద్రబాబు. పోలీస్ వ్యవస్థను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. వైసీపీ కోసమే పోలీస్ వ్యవస్థ పని చేస్తోందని చంద్రబాబు విమర్శలు చేశారు. జైలులో ఉన్న టీడీపీ నేతలను ఓ సారి లోకేష్.. మరోసారి చంద్రబాబు పరామర్శించారు. ధైర్యం కోల్పోవద్దన భరోసా ఇచ్చారు. మూడు దశాబ్దాలుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు పర్యటనలో ఎప్పుడూ వివాదం కాలేదు. ఈ సారి ఘర్షణలు చోటు చేసుకోవడంతో వైఎస్ఆర్‌సీపీ నేతల పనేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కుప్పంలో జగన్ పర్యటన ముగిసిన తర్వాత బెయిల్
కుప్పంలో సీఎం జగన్ పర్యటన ముగిసిన వెంటనే బెయిల్ లభించింది. సీఎం జగన్ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలందర్నీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కుప్పంలో జగన్ పర్యటన సాఫీగా సాగిపోయింది.
ఏపీలో పెన్షన్ పెంపు, వచ్చే జనవరి నుంచి అమలు - కుప్పానికి చంద్రబాబు ఏమీ చేయలేదు: జగన్