Minister Tummala Nageswararao Announcement On Loan Waiver: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 లక్షలకు పైబడిన వారి రుణమాఫీపై త్వరలోనే ప్రకటన చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao) తెలిపారు. హైదరాబాద్‌లో (Hyderabad) శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు (Sreedharbabu) మాట్లాడారు. రైతు భరోసా సబ్ కమిటీ నివేదిక రాగానే రైతులకు అందిస్తామన్నారు. ఈ ఏడాది వరి సాగులో తెలంగాణ టాప్‌గా నిలిచిందని.. 1.50 కోట్ల ఎకరాల దిగుబడితో పంజాబ్‌ను వెనక్కి నెట్టామని అన్నారు. గతంలో 41 లక్షల ఎకరాల్లో ఉన్న దొడ్డు ధాన్యం ఈ ఏడాది 21 లక్షలకు పడిపోయిందని చెప్పారు. 'రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి పెరిగింది. దేశవ్యాప్తంగా సన్న ధాన్యానికి డిమాండ్ పెరిగింది. 25 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. 66.77 లక్షల ఎకరాల్లో 146 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.625 కోట్లు రైతులకు అందించాం.' అని మంత్రి పేర్కొన్నారు.
సన్న ధాన్యానికి బోనస్
రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సన్నధాన్యానికి బోనస్ ఇస్తామని.. సన్న ధాన్యం సేకరించిన వారంలోపే డబ్బులు చెల్లిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. 'బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ప్రస్తుతం ఆర్థిక కష్టాలున్నా.. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. అన్నదాతల కష్టాలపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రైతులకు మేలు చేసేందుకు ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరితే.. ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనిని అడ్డుకోవాలని చూస్తున్నారు. రైతులపై బీజేపీకి ప్రేమ ఉంటే తేమ శాతం నిబంధనలు మార్చాలి.' అని అన్నారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ధాన్యం కొనుగోలు సాగుతుందని.. అయినా బీజేపీ రైతులను ఆగం చేసేందుకు యత్నిస్తోందని మంత్రులు మండిపడ్డారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని స్పష్టం చేశారు.