Hyderabad News | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే అధికారుల వద్ద ఉండాల్సిన సమగ్ర సర్వే దరఖాస్తు ఫారాలు రహదారి పక్కన దర్శనమిచ్చాయి. అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు తాము చేపట్టామని చెప్పిన సర్వేకు సంబంధించిన ఫారాలు రోడ్డు పక్కన కుప్పలుగా కనిపించడంతో వాటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోడ్డు పక్కన సమగ్ర సర్వే దరఖాస్తులు
కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దరఖాస్తు ఫారాలు మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కనిపించాయి. పేదలకు, అన్ని వర్గాలకు మేలు చేయడం కోసమే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే మొదలుపెట్టింది. కానీ సమగ్ర సర్వే ఫారాలు రోడ్డు పక్కన కుప్పలుగా కనిపించడంతో అంతా షాకయ్యారు. సమాచారం అందుకున్న మేడ్చల్ మునిసిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని దరఖాస్తులు పరిశీలించారు. తమ సిబ్బందితో కలిసి సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తులను కారులో అక్కడి నుంచి ఆఫీసుకు తరలించినట్లు సమాచారం.
గతంలో ప్రజాపాలన దరఖాస్తులు, ఇప్పుడు సమగ్ర సర్వే ఫారాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. ప్రజలకు ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల పక్కన దర్శనమివ్వడం తెలిసిందే. ప్రజల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని చెప్పిన నేతలు.. ఇలా రోడ్లపై ఎలా పడేస్తారని అప్పట్లోనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు ఫారాలను అన్ లైన్ లో అప్‌లోడ్ చేసేందుకు తీసుకెళ్తుండగా పొరపాటుగా రోడ్డుపై పడిపోయి ఉంటాయని అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు మేడ్చల్ జిల్లాలో రహదారి పక్కన పడేసినట్లు స్థానికులు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమాచారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడుతున్నారు.
తెలంగాణలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కచ్చితంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. నిజామాబాద్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ సైతం ఇదే విషయాన్ని హామీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం తాము సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. అందులో భాగంగా తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు పలుమార్లు వెల్లడించారు. సమగ్ర సర్వే కాదని, అది బోగస్ సర్వే అని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఆరు గ్యారంటీలు, రైతులకు రైతు బంధు, రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కార్ కాలయాప చేస్తుందని ఆరోపిస్తున్నారు.