Telangana Tourisam In Berlin :    జర్మనీ రాజధాని బెర్లిన్ లోని   ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్   , బెర్లిన్ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్ లో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో  స్టాల్ ఏర్పాటు చేశారు.  ఈ స్టాల్ ను   పర్యాటక, సాంస్కృతి మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్   ఆదేశాల మేరకు తెలంగాణ టూరిజం ప్రాంతాల విశిష్టతను అంతర్జాతీయ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించడం జరిగిందని మంత్రి తెలిపారు.  ఈ ప్రదర్శనలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం, బుద్ధవనం, తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను  ప్రదర్శించారు.                          


తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ వారి ఆధ్వర్యంలో బతుక మ్మ సంబరాలను తెలంగాణ టూరిజం స్టాల్ వద్ద నిర్వహించారు. బెర్లిన్ లోని ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్లో తెలంగాణ టూరిజం స్టాల్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ టూరిజం కల్చర్ ఎగ్జిబిషన్లో 180 దేశాలకు చెందిన పర్యాటక, సాంస్కృతిక సంస్థలు పాల్గొంటున్నాయి.  తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని  వాటన్నింటినీ ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.                 


తెలగాణ పర్యాటక ప్రాంతాలకు సరైన ప్రమోషన్ ను కల్పించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తెలంగాణ పర్యాటక పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు ప్రపంచ స్థాయి వేదికలపై తెలంగాణ టూరిజం ప్రమోషన్ ను నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్రం టూరిజం హబ్ గా ఇప్పటికే పలు టూరిజం సంస్థలు గుర్తించి అవార్డులు అందిస్తున్నాయన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్, జర్మనీలోని భారత రాయబారి పర్వతనేని హరీష్ రావు, ఇండియా టూరిజం సెక్రటరీ అరవింద్ సింగ్,  జర్మనీలోని తెలంగాణ అసోసియేషన్ సభ్యులు ఈ టూరిజం స్టాల్ ఏర్పాటుకు సహకారం అందించారు.                 


తెలంగాణకు పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులు వస్తూ ఉంటారు. మెడికల్ టూరిజం కూడా ఎక్కువే.  అందుకే తెలంగాణ పర్యాటక ప్రాంతాలను విస్తృతంగా ప్రమోట్ చేస్తే.. టూరిజం ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసులు తెలంగాణ టూరిజం ప్రమోషన్‌కు సహకరిస్తున్నారు.