Ponnam Prabhakar News: రామగుండం ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యి, అక్కడి నుంచి తరలిస్తున్న ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేసిన హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా ఓ గ్రూపునకు చెందిన మీడియా సంస్థలపై లీగల్ నోటీసులు పంపారు. బీఆర్ఎస్ ‌కు చెందిన ఓ న్యూస్ ఛానెల్ సహా ఆ సంస్థ ఎండీ జోగినపల్లి సంతోష్ కుమార్, దాని అనుబంధ దినపత్రిక చీఫ్ ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి, తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లకి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. అడ్వకేట్ ఈటోరు పూర్ణచందర్ రావు ఈ నోటీసులను జారీ చేశారు.


ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుండి ఉత్పత్తి అవుతుందని.. అది వినియోగించుకోవడానికి వీలుండదని వివరించారు. దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారని.. ఈ ఫ్లై యాష్ ను రోడ్ల నిర్మాణానికి, బ్రిక్స్ తయారీకి ఉపయోగిస్తారని చెప్పారు. ఈ ఫ్లై యాష్ రామగుండం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్తుంది. ఈ లారీలలో ఎంత ఫ్లై యాష్ పోతుంది అనేది ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుందని తెలిపారు.


ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగాల్సింది పోయి హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి లారీలను ఆపి మంత్రిపై ఆరోపణలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ లారీలు ఓవర్ లోడ్ తో వెళ్తున్నాయని.. ప్రతి లారికి డబ్బులు తీసుకుంటూ పంపిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేశారు. ఆయన పరువుకు భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేశారని న్యాయవాది వెల్లడించారు.


ఫ్లై యాష్ అనేది రోజుకు వేల మెట్రిక్ టన్నులు వెళ్తుంటాయని.. అది అధికారులు చూసుకుంటారని.. పంపిస్తున్న ఎన్టీపీసీ చూసుకుంటుందని అన్నారు. అది టెండర్ ద్వారా  ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు చూసుకుంటారని అన్నారు. కానీ వ్యక్తిగత కక్షతో రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలకు గానూ అడ్వకేట్ పూర్ణచందర్ రావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారని అన్నారు. అది ప్రసారం చేసిన బీఆర్ఎస్ అనుకూల మీడియాలోని ఛానెల్, పత్రికలకు ఈ లీగల్ నోటీసులు పంపించారని చెప్పారు.