కాంగ్రెస్‌ అంటే కన్నీళ్లు, కష్టాలు అని.. బీఆర్‌ఎస్‌ అంటే సాగునీళ్లు.. సంక్షేమం అని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతు బంధు కేసీఆర్‌ కావాలా? రాబంధు కాంగ్రెస్‌ కావాలా? అని ప్రశ్నించారు. తెలంగాణకు మొండి చెయ్యి చూపే బీజేపీ, మరోవైపు చెవిలో పువ్వులు పెట్టే కాంగ్రెస్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంచిర్యాల జిల్లాలో రూ.313 కోట్ల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే, బాల్క సుమన్‌తో కలిసి కేటీఆర్ రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు పిలుపు ఇచ్చారు. 


ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో 60 ఏళ్ల పాటు కరెంటు, నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ చావగొట్టిందని.. అమలు చేయడానికి వీలు లేని హామీలతో 6 గ్యారంటీలు ఇస్తుందని విమర్శించారు. 150 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్‌ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 


24 గంటల కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్‌ కావాలా? 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్‌ కావాలో ఒక్కసారి ఆలోచించుకోవాలని అన్నారు. ప్రధాని మోదీ ఎన్ని చెప్పినా ఉత్తి మాటలే అని.. రాష్ట్రానికి రావడమే తప్ప ఇచ్చింది.. తెచ్చింది ఏమీ లేదని విమర్శించారు.


వారంటీ లేని పార్టీ గ్యారంటీలను నమ్ముదామా? అని ప్రశ్నించారు. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే 3 గంటల కరెంటు గ్యారంటీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏడాదికి ఓ ముఖ్యమంత్రి రావడం గ్యారంటీ అని అన్నారు. ఆకాశం నుంచి పాతాళం వరకు కుంభకోణాలు జరగడం గ్యారంటీ అని విమర్శించారు.