మాజీ మంత్రి నారాయణ త్వరలో అరెస్ట్ అవుతారని జోస్యం చెప్పారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నారాయణకు అరెస్ట్ భయం పట్టుకుందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారాయణపై కూడా అభియోగాలు ఉన్నా.. ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇదే కేసులో ఇప్పుడు నారా లోకేష్ కి సీఐడీ 41-ఎ నోటీసులిచ్చింది. ఈ కేసులోనే నారాయణ అరెస్ట్ అవుతారని చెప్పారు అనిల్. 


ఆయన సత్యహరిశ్చంద్రుడా..?
పేదల భూములు కొట్టేసిన నారాయణ సత్య హరిశ్చంద్రుడా? అని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్. రూ.800 కోట్ల పేదల అసైన్డ్‌ భూములు నారాయణ దోచేశారని చెప్పారు. త్వరలో నారాయణ అక్రమాలన్నీ బయటపడతాయని అన్నారు అనిల్. విచారణకు సహకరించకూడదని బాబు, నారాయణ మాట్లాడుకున్నారని, వారి చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసని చెప్పారు. ఇటీవల రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ కోసం నారాయణ వెళ్లారు. ఆ సందర్భంలో ఆయన కేసుల గురించే చంద్రబాబుతో చర్చించారని, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణకు సహకరించకూడదనే నిర్ణయానికి వచ్చారని చెప్పారు అనిల్. నారాయణ విషయంలో అన్ని ఆధారాలను సీఐడీ సేకరిస్తుందని ఆయన అరెస్ట్ ఖాయం అని అంటున్నారు అనిల్. 


అది దేవుడి స్క్రిప్ట్..
టీడీపీ నేతలు గంటలు కొట్టడం దేవుడి స్క్రిప్ట్ అని ఎద్దేవా చేసారు అనిల్ కుమార్ యాదవ్. ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను చిత్ర హింసలు పెట్టి, ఇబ్బందులు పెట్టిన విషయం టీడీపీ నేతలకు గుర్తు లేదా..? అని ప్రశ్నించారు. గతంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభంను అధికారంలో ఉన్న టీడీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అందరికీ తెలుసన్నారు. అప్పట్లో కంచాలు మోగించండి అంటూ ముద్రగడ పిలుపునిచ్చారని, ఇప్పుడు టీడీపీ నేతలు కూడా అదే పని చేశారని, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అన్నారు అనిల్. ముద్రగడను హింసించినందుకు చివరకు చంద్రబాబుకోసం టీడీపీ నేతలు అదే పని చేయాల్సి వచ్చిందన్నారు. 


ఢిల్లీలో బిల్డప్ లు..
లోకేష్ ఒక పులకేశి అని, ఢిల్లీలో లాయర్స్‌తో మాట్లాడుతున్నాడని టీడీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు అనిల్. కేసులకు భయపడి లోకేష్ ఢిల్లీలో దాక్కుని ఉన్నారన్నారు. సీఐడీ అధికారులు విచారణకోసం నోటీసులిచ్చేందుకు వచ్చినా లోకేష్ వారిని తప్పించుకుని తిరిగాడని, చివరకు ఆయన్ను వెదికి పట్టుకుని సీఐడీ అధికారులు నోటీసులిచ్చారని చెప్పారు. అధికారులకు దొరక్కుండా లోకేష్ దొంగలా తప్పించుకుని తిరిగుతున్నాడని అన్నారాయన. చంద్రబాబు తర్వాత నారా లోకేష్ కూడా విచారణ ఎదుర్కోక తప్పదన్నారు. 2024లో టీడీపీ పతనం సంపూర్ణం అవుతుందని చెప్పారు అనిల్. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చేసిన తప్పులే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారాయని, అమరావతి పేరుతో, స్కిల్ డెవలప్మెంట్ పేరుతో, ఫైబర్ నెట్ పేరుతో.. జనం సొమ్ము దోచేయాలని చూశారని, అందుకే ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారని చెప్పారు. 


ప్రజల ఆరోగ్య రక్షణే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు అనిల్. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు మరోసారి విజయాన్ని అందిస్తాయన్నారు. నెల్లూరు సిటీలో నారాయణ పోటీ సంగతి దేవుడెరుగు, ఆయన ముందు జైలుకెళ్లకుండా ఉంటారా అని సెటైర్లు పేల్చారు అనిల్.