KTR Adilabad Visit: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అక్కడి విద్యార్ఖులను కలిశారు. వారి సమస్యలను గురించి అడిగి తెలుసకున్నారు. అనంతరం క్యాంపస్ లోని మెస్ హాలులో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆపైన బాసర ట్రిపుల్ ఐటీలో అధికారిక కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు ఆదిలాబాద్ వెళ్లిన ఆయన.. ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీడీ ఎన్టీ ల్యాబ్ ను సందర్శించిన కేటీఆర్.. ఈ మేరకు స్పష్టం చేశారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డితో కలిసి ఆదిలాబాద్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ఐటీ ఉద్యోగులతో మాట్లాడారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
త్వరలోనే ఆదిలాబాద్ లో ఐటీ పార్కు..
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఐటీ పాలసీని అమలు చేస్తున్నారని.. దాని వల్ల ఐటీ రంగం కేవలం హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా.. అంతటా విస్తరిస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. రూరల్ టెక్నాలజీ పాలసీ వల్ల ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ విస్తరిస్తోందని వివరించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, నిజామాబాద్ లాంటి నగరాల్లో ఇప్పటికే ఐటీ పార్కులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన కేటీఆర్.. కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఐటీ పరిశ్రమలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాలకు కూడా ఐటీ విస్తరించడం సంతోషకరంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు అమెరికా కంపెనీలతో పని చేస్తున్నారని కేటీఆర్ కొనియాడారు. ఇప్పటికే ఆదిలాబాద్ లో కొనసాగుతున్న బీడీ ఎన్టీ ల్యాబ్ భవనం కోసం రూ 1.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు.
చాకలి ఐలమ్మకు మంత్రుల నివాళి..
అంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్ర కరణ్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డిని టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మావల జాతీయ రహదారి నుంచి జిల్లా కేంద్రం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై కేటీఆర్. జై టిఆర్ఎస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు నివాళి అర్పించారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కు ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు.
కేటీఆర్ కాన్వాయ్ ఎదుట నిరసన..
నూతన జోనల్ విధానానికి అనుగుణంగా చేపట్టిన పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపు విషయంలో ప్రభుత్వం తెచ్చిన జీవో 317తో అన్యాయం జరుగుతోందని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ఎదుట ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. జివో 317తో స్థానికులే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. వెంటనే 317 జీవోను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు వినతి పత్రం ఇస్తామన్నా ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు.