లోక్ సభ నియోజకవర్గాల్ని పునర్విభజించే (డీలిమిటేషన్‌) అంశంపై దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి కేంద్రం తీసుకోవాలని కేటీఆర్‌ కోరారు. దేశంలో ఆర్థికపరంగా ఉత్తమంగా పర్ఫామ్ చేస్తున్న రాష్ట్రాల వారసులుగా దక్షిణాది ప్రజలు గర్వపడుతున్నారని అన్నారు. అలాంటి దక్షిణ భారతంలో లోక్ సభ సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని అన్నారు. పార్లమెంట్‌ అనేది దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అని, దక్షిణాది గొంతును అణచివేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలను వింటుందని, డీలిమిటేషన్ ను సమర్థంగా చేస్తుందని ఆశిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 


ఈ మేరకు కేటీఆర్ ఓ జాతీయ వార్తా సంస్థ రూపొందించిన నివేదికను కూడా జత చేశారు. దక్షిణాది రాష్ట్రాల పరిధిలో ప్రస్తుత లోక్ సభ సీట్లు తగ్గే అవకాశం ఉందని అందులో ఉంది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఝార్ఖండ్, హరియాణా, గుజరాత్, ఢిల్లీ, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు పెరుగుతాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.