ఉక్రెయిన్‌లో చిక్కుకొని ఆందోళన మధ్య ఉంటున్న తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకోవాల‌ని కోరుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ విదేశాంగ శాఖ మంత్రి జయశంక‌ర్‌కు ట్వీట్ చేశారు. విద్యార్థుల‌ను స్వదేశానికి ర‌ప్పించేందుకు ప్రత్యేక విమానాల‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే విద్యార్థుల పూర్తి ప్రయాణ ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డానికి తెలంగాణ‌ ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని కేటీఆర్ తెలిపారు.


మరోవైపు, ఉక్రెయిన్‌లోని తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకోవడం కోసం ప్రభుత్వం చర్యలు చేప‌ట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌, రాష్ట్ర సచివాల‌యంలో హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ సెంట‌ర్లకు రాత్రి నుంచి ఇప్పటి వ‌ర‌కు 75 ఫోన్ కాల్స్ వ‌చ్చిన‌ట్లు సీఎస్ వెల్లడించారు. ఎప్పటిక‌ప్పుడు విదేశాంగ శాఖ అధికారుల‌తో సీఎస్ సోమేశ్ కుమార్ సంప్రదింపులు జ‌రుపుతున్నారు. తెలంగాణ విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన భ‌రోసా ఇస్తున్నామ‌ని తెలిపారు.


ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో
* విక్రమ్ సింఘ్ మాన్: +91 7042566955
* చక్రవర్తి పీఆర్‌వో: +91 9949351270
* నితిన్ ఓఎస్డీ: +91 9654663661
* ఈ-మెయిల్ ఐడీ: rctelangana@gmail.com


తెలంగాణ సచివాలయం
* చిట్టిబాబు ఏఎస్‌వో: 040-23220603, +91 9440854433
* ఈ-మెయిల్ ఐడీ : so_nri@telanagan.gov.in


ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఎంపీపీ కుమారుడు
కామారెడ్డి జిల్లా గాంధారి ఎంపీపీ రాధ కుమారుడు రాహుల్ ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. నాలుగు నెలల క్రితమే ఎంబీబీస్ చదువు కోసం అతను అక్కడికి వెళ్లారు. ఉక్రెయిన్‌లోని ఓబ్లాస్ట్ అనే రాష్ట్రం ఇవానో ఫ్రాoక్విస్క్ నగరంలోని నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో రాహుల్ మెడిసిన్ చదువుతున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుండడంతో రాహుల్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గంటకొకసారి ఫోన్లో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి తమ వారిని జాగ్రత్తగా తీసుకురావాలని వారు వేడుకుంటున్నారు.


ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థిని తల్లిదండ్రుల ఇంటికి బండి సంజయ్
జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూర్ గ్రామానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న బద్ధం నిహారిక కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. నిహారికతో వీడియో కాల్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులెవరూ ఆందోళన పడొద్దని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. అక్కడున్న అందరినీ సురక్షితంగా భారత్ తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నిహారిక చదువుకుంటున్న వర్సిటీలో తెలుగు వాళ్ళందరి ఫోన్ నంబర్లు పంపితే అందరితో మాట్లాడి భారత్ తీసుకొచ్చేందుకు విదేశీ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతామని భరోసా కల్పించారు.