కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ పై డీకే చేసిన విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ రాష్ట్రానికి వస్తే పథకాల అమలు చూపిస్తామంటూ డీకే వ్యాఖ్యానించగా, మీ వైఫల్యాలను చూడడానికి కర్ణాటక వరకూ వెళ్లాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కు అధికారమిస్తే అంధకారమేనని కర్ణాటక దుస్థితిని చూసిన తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు. 






'మీ చేతగానితనానికి నిదర్శనం'


దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తుంటే, ఇక్కడికి ప్రచారానికి వచ్చి కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అది మీ చేతగానితనానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. 'ఓ వైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా, తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా.? మీ వైఫల్యాలు చూడడానికి అక్కడి వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే, ఇక్కడకు వచ్చి మీరు వారికి చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదం గురించి వివరిస్తున్నారు.' అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.


'హామీలతో అరచేతిలో వైకుంఠం'


కర్ణాటకలో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని అక్కడి ప్రజలు క్షమించరని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం 5 హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. 'మీ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయింది. ఎడాపెడా కరెంట్ కోతలు, ఛార్జీల వాతతో కర్ణాటక చీకటి రాజ్యంగా మారిపోయింది. కనీసం 5 గంటల కరెంట్ లేక అక్కడి రైతులే కాదు. వ్యాపార సంస్థలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. మీ అన్న భాగ్య స్కీమ్ అటకెక్కింది. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక, మీ వైఫల్యాలకు అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ అల్లాడిపోతున్నారు. రేషన్ పై కూడా సన్న బియ్యం ఇవ్వాలన్న మా సంకల్పానికి, కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని మీ దుస్థితికి తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంది.' అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.


కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని కేటీఆర్ ప్రశంసించారు. మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి కర్ణాటకలో ఆర్టీసీని దివాళా తీయించారని, ఇది అక్కడి ఉద్యోగులకు పెను ప్రమాదంగా మారిందన్నారు. మహిళల ఖాతాల్లో డబ్బులేస్తామన్న హామీకి కూడా గ్రహణం పట్టించారని మండిపడ్డారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే కమీషన్ల కుంభమేళాకు తెర తీశారని, వారి అవినీతి భాగోతం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. మళ్లీ తెలంగాణలో ఆ పార్టీని నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని అన్నారు. ఎందుకంటే, 'తెలంగాణ గడ్డ, చైతన్యానికి అడ్డా' అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు.


Also Read: కాంగ్రెస్ ప్రకటించిన రెండు లిస్టుల్లో షబ్బీర్ అలీ పేరే లేదు, కానీ నన్ను ఓడిస్తాడంట - సీఎం కేసీఆర్