Minister KTR: వైద్యుడిని కావాలన్న అమ్మ కోరికను, ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న నాన్న కోరికను తీర్చలేకపోయానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ఈ కామెంట్లు చేశారు. నూతన మెడికల్ కాలేజీ వల్ల తెలంగాణలో ఏటా పది వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకొచ్చారు. తాను కూడా బైపీసీ విద్యార్థినే అని గుర్తు చేశారు. అయితే తండ్రి తనను ఐపీఎస్ ఆఫీసర్ చేయాలని అనుకున్నారని.. అమ్మ డాక్టర్ చేయాలని కలలు కన్నారని వివరించారు. ఎంసెట్ లో 1600 ర్యాంక్ సాధించినప్పటికీ... ఎంబీబీఎస్ లో సీటు రాలేదని.. ఇప్పుడు అటు డాక్టర్, ఇటు ఐఏఎస్ ఆఫీసర్ ను కాకుండా రాజకీయ నాయకుడిని అయ్యానని అన్నారు. తాను మొదటి సారి అంటే 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యే ఎన్నిక అయినప్పుడు.. అక్కడ ఓ డిగ్రీ కాలేజీ ఏర్పాటు కోసం గొడవ జరిగిందని గుర్తు చేశారు.
డిగ్రీ కళాశాలను సిరిసిల్ల, వేములవాడలో పెట్టాలని గొడవ జరిగితే.. అటు, ఇటు కాకుండా మధ్యలో పెట్టారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటిది ఈరోజు సిరిసిల్లకు జేఎన్టీయూ, మెడికల్ కాలేజీ, అగ్రికల్చల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని స్పష్టం చేశారు. పేదలకు సేవ చేసేందుకు మంచి శిక్షణ పొందడని అన్నారు. ఆపదలో వచ్చే వాళ్లు అటు దేవుడిని ఇటు వైద్యులను వేడుకుంటారని వివరించారు. కాబట్టి వైద్య వృత్తిని అభ్యసించే వారు బాగా చదువుకొని ప్రజలకు సేవ చేయాలన్నారు. మెడికల్ విద్యార్థులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
పరిపాలన చేతకాదు అని ఎగతాళి చేసిన పరిస్థితుల నుంచి ఇప్పుడు తెలంగాణలోని ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని కేసీఆర్ అన్నారు. గతంలో రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇవాళ ఆ సంఖ్య 26కు చేరుకుందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి 8 కాలేజీలు కొత్తగా ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ఈ కొత్త వైద్య కళాశాలలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కూడా లభించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 2014లో రాష్ట్రంలో 2,850 మెడికల్ సీట్లు ఉంటే 2023 నాటికి 8,515 మెడికల్ సీట్లు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా వైద్యశాఖ మంత్రి, కార్యదర్శిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. 85 శాతం మెడికల్ సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కాలని పటిష్టంగా పోరాటం చేసి హైకోర్టులో విజయం సాధించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా ప్రతి సంవత్సరం 10 వేల మంది వైద్యులను ఉత్పత్తి చేయబోతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
Read Also: Telangana CM KCR: ఒకేసారి 9 మెడికల్ కాలేజీల ప్రారంభం- గొప్ప రోజుగా అభివర్ణించిన కేసీఆర్