Telangana CM KCR: తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన దినం ఇది అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది వైద్య కళాశాలలు ప్రారంభించుకోవడం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ విధానంలో ఒకేసారి 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో ఈ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి.
ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటామని, కానీ ఈ కార్యక్రమం ఎంతో ఆత్మసంతృప్తి కలిగిస్తుందని తెలిపారు. పరిపాలన చేతకాదు అని ఎగతాళి చేసిన పరిస్థితుల నుంచి ఇప్పుడు తెలంగాణలోని ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని కేసీఆర్ అన్నారు. గతంలో రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇవాళ ఆ సంఖ్య 26కు చేరుకుందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి 8 కాలేజీలు కొత్తగా ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ఈ కొత్త వైద్య కళాశాలలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కూడా లభించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
2014లో రాష్ట్రంలో 2,850 మెడికల్ సీట్లు ఉంటే 2023 నాటికి 8,515 మెడికల్ సీట్లు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యశాఖ మంత్రి, కార్యదర్శిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. 85 శాతం మెడికల్ సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కాలని పటిష్టంగా పోరాటం చేసి హైకోర్టులో విజయం సాధించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా ప్రతి సంవత్సరం 10 వేల మంది వైద్యులను ఉత్పత్తి చేయబోతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో త్వరలో 50వేల పడకలు
ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో.. అక్కడ తక్కువ మరణాలు, నష్టాలు సంభవిస్తాయని కేసీఆర్ అన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మెడికల్ కాలేజీలతో పాటు అద్భుతమైన ఆస్పత్రులను కూడా తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనతగా తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆస్పత్రులు నిర్మాణం కాబోతున్నాయని.. త్వరలోనే 50 వేల పడకలకు చేరుకోబోతున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కిట్ అంటే.. నాలుగు సబ్బులు, మూడు వస్తువులు కాదని.. వేజ్ లాస్ ను భర్తీ చేయడమే కేసీఆర్ కిట్ వెనక ఉన్న ఫిలాసఫీ అని కేసీఆర్ స్పష్టం చేశారు. నిరుపేద మహిళలు గర్భం దాల్చిన తర్వాత కూడా కూలీ పనులకు వెళ్తుంటారని.. వారి ఆరోగ్యాన్ని, శిశువు ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో మానవీయ కోణంలో తీసుకు వచ్చిందే కేసీఆర్ కిట్ అని తెలిపారు. అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణీలను ఆస్పత్రులకు తీసుకు వచ్చి చికిత్స చేయిస్తున్నామని, డెలివరీ తర్వాత తల్లీబిడ్డలను వారి ఇంటికి తరలిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇలాంటి సౌకర్యం మరే రాష్ట్రంలోనూ లేదని వెల్లడించారు.
కేసీఆర్ కిట్ తో మంచి ఫలితం వచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. 2014లో తల్లులు 92 మంది చనిపోతే.. ఇవాళ 43 కు తగ్గించినట్లు తెలిపారు. శిశు మరణాలను 21కి తగ్గించామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగేతే.. ఇప్పుడు 76 శాతానికి పెంచామన్నారు.