పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. సీఎం కేసీఆర్ ఈరోజు ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు.  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. భావోద్వేగభరితమైన ట్వీట్‌ చేశారు. తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ, పల్లేర్లు మొలిచిన పాలమూరులో  పాలనురగల జలహేల, వలసల వలపోతల గడ్డపైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం కానుందని అన్నారు. కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో  కృష్ణమ్మ జల తాండవం చేయనుందంటూ ట్వీట్‌ చేశారు. శెలిమలే దిక్కైన కాడ ఉద్దండ జలాశయాలు.. బాయిమీద పంపుసెట్లు నడవని చోట బాహుబలి మోటర్లు .. స్వరాష్ట్ర  ప్రస్థానంలో సగర్వ సాగునీటి సన్నివేశం.. ఆరు జిల్లాలు సస్యశ్యామలం దక్షిణ తెలంగాణకు దర్జాగా జలాభిషేకం అంటే కవిత రూపంలో తన భావాలను పంచుకున్నారు మంత్రి  కేసీఆర్‌. 


నిన్న..పరాయి నేలపైన ప్రాజెక్టులకు రాళ్ళెత్తిన పాలమూరు లేబర్.. నేడు..సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్ అని అన్నారు. నాడు ..నది పక్కన  నేల ఎడారిలా ..ఎండిన విషాదం.. సమైక్య పాలకుల పాపం.. కాంగ్రెసోళ్ల శాపం! బిర బిరా తరలి వెళ్తున్న కృష్ణమ్మను బీడు భూములకు రప్పించేందుకు స్వయం పాలనలో  సాహస యజ్ఞం! ఆటంకాలు అవరోధాలు అధిగమించి ప్రతి పక్షాల కుట్రలు కేసులు ఛేదించి సవాల్ చేసి సాధించిన విజయం! నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం అనుమతుల్లో  అంతులేని జాప్యం. ఐనా.. కేంద్ర సర్కారు కక్షను వివక్షను దీక్షతో గెలిచిన దృఢ సంకల్పం! తీరిన దశాబ్దాల నీటి వెత తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత..!అంటూ ట్వీట్‌  చేశారు కేటీఆర్‌. 


నిజంగానే.. పాలమూరు ప్రజల దశాబ్ధాల కల సాకారం కాబోతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవాళ ప్రారంభం కాబోతోంది. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్టం  తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చుతామని ప్రకటించిన బీఆర్ఎస్‌ ప్రభుత్వం అందుకు తగినట్లుగానే రాష్ట్రంలోని సాగు, తాగునీటికి లోటు లేకుండా ఎత్తిపోతల  ప్రాజెక్టులను నిర్మించి అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగానే శనివారం రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. పాలమూరు  గడ్డపై ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, జిల్లాల సాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారం చూపింది కేసీఆర్‌ ప్రభుత్వం. నాగర్‌కర్నూల్‌ జిల్లా  కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అటుపై కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు.దశాబ్ధాల కల ఇప్పటికి  సాకారం అవడంతో పాలమూరు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12లక్షల 30వేల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి  రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో తాగునీరు, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి  చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. అందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం బ్యాక్‌  వాటర్‌ నుంచి మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా.. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఆయా ప్యాకేజీల  పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకొన్నాయి. ఇక ప్రాజెక్టు ద్వారా నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, కొడంగల్‌, నారాయణపేట, మక్తల్‌, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి,  అచ్చంపేట, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,226  గ్రామాలకు తాగు, సాగునీరు అందనుంది.